అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ డిక్టరేషన్ అమలు సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రానికి ఐదుగురు మంత్రుల బృందం చేరుకుంది.
BC Declaration | మంత్రుల ఆధ్వర్యంలో పరిశీలన
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), సీతక్క(Seethakka), కొండా సురేఖ(Konda Surekha), వాకాటి శ్రీహరి (Vakati Srihari), ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కళాశాల మైదానాలను పరిశీలించారు.
BC Declaration | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో..
ముందుగా ఇందిరాగాంధీ స్టేడియంను (Indira Gandhi Stadium) మంత్రులు పరిశీలించారు. లక్ష మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేయడంతో జనాలకు స్టేడియం సరిపోదని భావించారు. దాంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. జనాలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసేందుకు కళాశాల మైదానం అనువుగా ఉంటుందని నిర్ణయించారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చర్చించారు. డిగ్రీ కళాశాలలో సభ ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
BC Declaration | ఇచ్చిన హామీ మేరకు..
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చింది. అధికారంలోకి వస్తే 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చింది.
అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్‌పై (BC Reservation) అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం అడ్డుపడితే ఆ నెపం కేంద్రంపై నెట్టేసి స్థానిక ఎన్నికల్లో (Local Elections) ప్రచారం చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే ఇచ్చిన హామీని అమలు చేశామని ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.