అక్షరటుడే, బాన్సువాడ : Banswada | సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో (Gurukul School) ఆదివారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంచీలను తరలించే క్రమంలో ఓ విద్యార్థిని తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటన బాన్సువాడ మండలంలోని బోర్లాం క్యాంప్‌లో (Borlam Camp) చోటు చేసుకుంది.
Banswada | ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ ఇంట్లో వేడుకకు..
బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఇంట్లో ఆదివారం ఫంక్షన్ ఉండడంతో గురుకులంలో ఉన్న ఫర్నిచర్‌ను ఆమె ఇంటికి తీసుకువెళ్లారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆటోలో ఫర్నిచర్‌ను తిరిగి గురుకులానికి తీసుకొచ్చారు. కుర్చీలను విద్యార్థులు, సిబ్బంది కిందికి దించుతుండగా 8వ తరగతి చదువుతున్న మద్నూర్ మండలం (Madnoor Mandal) కొడిచిర గ్రామానికి చెందిన విద్యార్థిని సంగీత ప్రమాదవశాత్తు ఆటోలోంచి పడి తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్ర గాయమవడంతో ఆటోలో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
Banswada | విద్యార్థిని మృతి తీవ్రంగా కలిచివేసింది.. ఎమ్మెల్సీ కవిత..
గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సంగీత మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కారు నిర్లక్ష్యంతో మరో గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బిడ్డను కోల్పోయిన సంగీత తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు ఈ దుఃఖం నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కవిత తెలిపారు.