అక్షరటుడే, వెబ్‌డెస్క్: DGP Jitender | డీజీపీ జితేందర్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయనకు పోలీసు శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. హైదరాబాద్‌లో (Hyderabad) నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో డీజీపీ జితేందర్ (DGP Jitender) భావోద్వేగానికి గురయ్యారు. 33 ఏళ్ల తన సర్వీసు గురించి వివరించారు.
డీజీపీగా గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చామని చెప్పారు. రాష్ట్రంలో నేరాల రేటును తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో తలెత్తిన వరదల్లో అనేక మంది ప్రాణాలను కాపాడామని తెలిపారు.
DGP Jitender | 10 లక్షల సీసీ కెమెరాలు..
నార్కోటిక్స్, సైబర్ విభాగాలను పటిష్టం చేసి నేరాలను నియంత్రిస్తున్నామని వివరించారు. బెట్టింగ్ మాఫియాపై (Betting Mafia) లోతుగా విచారణ చేస్తున్నామన్నారు. నేరాల ఛేదనలో టెక్నాలజీ కీలకంగా మారిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలతో నిఘా ఉందని, సంచలనం సృష్టించిన కేసులను 48 గంటల్లోనే ఛేదించామని చెప్పారు.
DGP Jitender | డీజీపీ పదవికి అర్హుడు..
కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డికి జితేందర్ అభినందనలు తెలిపారు. ఆయనకు ఇంటెలిజెన్స్‌లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పారు. శాంతిభద్రతల నియంత్రించడంలో ఆయన ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. నేషనల్ పోలీసు అకాడమీలో తనను ఏపీ కేడర్‌కు కేటాయించారని, గుంటూరులో శివధర్‌రెడ్డితో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
DGP Jitender | కంటతడి పెట్టుకున్న డీజీపీ..
వీడ్కోలు కార్యక్రమం సంద్భంగా డీజీపీ జితేందర్ భావోద్వేగానికు గురయ్యారు. తన కుటుంబం సహకరించడం వల్లే తాను విజయవంతంగా పని చేశానని చెప్పారు. ఇటీవల చనిపోయిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. తన ఎదుగుదల కోసం తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.
DGP Jitender | జితేందర్ ఆదర్శనీయం..
డీజీపీగా పదవీ విరమణ చేయనున్న జితేందర్ తమకు ఆదర్శనీయుడని కొత్త డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి అన్నారు. వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ ఇద్దరికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాము గుంటూరు జిల్లాలో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. జితేందర్ ఐడియాలజీ ఆదర్శనీయమని చెప్పారు. తెలంగాణ పోలీసు శాఖకు (Telangana Police Department) జితేందర్ చేసిన సేవలకు అభినందనలు తెలిపారు. ఆయన పనితీరు తమకు మార్గదర్శకత్వం చేస్తుందన్నారు.