అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా కొందరు డ్రగ్స్, గంజాయి విక్రయాలు చేపడుతున్నారు. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి (software employee) డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలిలో (Gachibowli) డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని కేశవ్ నగర్లో ఉండే సాయికిరణ్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే అతడు కొంతకాలంగా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. బెంగళూరు నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి సాయికిరణ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.30 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
Hyderabad | ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా..
నగరంలో డ్రగ్స్ కల్చర్ (drug culture) ఇటీవల పెరిగింది. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్ ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా నగరంలో గతంలో ఓ డాక్టర్ సైతం డ్రగ్స్ దందా చేస్తూ పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి చాలా మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంత మంది వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక.. మెళ్లిగా దందాలోకి దిగుతున్నారు.