అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ నవీన్ చంద్‌కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారంపై ఇటీవల ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావును సిట్ విచారిస్తోంది. గతంలో ఆయన విచారణకు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెల 25 వరకు ఆయన పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఒకవేళ అవసరం అయితే మరోసారి కస్టడీ కోసం పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
Phone Tapping Case | ఎలా నియమించారు
సిట్ అధికారులు తెలంగాణ (Telangana) మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ నవీన్ చంద్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభాకర్ రావును SIB ఓఎస్డీగా ఎలా నియమించారనే అంశంపై వారిని విచారించనుంది.ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై సైతం వివరాలు సేకరించే అవకాశం ఉంది.
Phone Tapping Case | అరెస్టులు తప్పవా..
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారు. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నా.. దర్యాప్తు మాత్రం అనుకున్నంత వేగంగా సాగలేదు. దీంతో ఇటీవల సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు అధికారులు గతంలో ప్రణీత్‌రావు (Praneeth Rao) సహా పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారనే విషయాలు రాబట్టడానికి అధికారులు యత్నిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే ఇది జరిగింది. వారి పేర్లు బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.