అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.
తమిళనాడులో మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డీఎంకే పార్టీ (DMK Party) ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే తమిళనాడులో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. తాజాగా ఆ కూటమిలోకి మరో పార్టీ చేరింది. పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) పార్టీ డీఎంకేకు షాక్ ఇచ్చి ఎన్డీలో చేరింది.
Tamil Nadu | మరిన్ని పార్టీలు..
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి బుధవారం పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏలోకి పీఎంకే చేరినట్లు ప్రకటించారు. తాము ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నామని, తమ కూటమిలో మరిన్ని పార్టీలను చేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా ఎన్డీఏ చేరారని, మరిన్ని పార్టీలు కూడా చేరతాయని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తమ కూటమి విజయం సాధిస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. పీఎంకే అధినేత రామదాస్ మాట్లాడుతూ.. ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి పీఎంకే, ఏఐఏడీఎంకేతో చేతులు కలిపిందన్నారు.
Tamil Nadu | దక్షిణాదిలో పట్టుకోసం..
బీజేపీ కొంతకాలంగా దక్షిణాదిలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక (Karnataka)లో పార్టీ బలంగానే ఉంది. తెలంగాణలో సైతం పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచింది. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికల్లో సైతం సత్తా చాటుతుంది. దీంతో తమిళనాడుపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. దీంతో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.
Tamil Nadu | త్రిముఖ పోరు
తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. అధికార డీఎంకే పార్టీ బలంగానే ఉంది. అయితే ప్రజావ్యతిరేకత, హిందువులపై ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు కొంత నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ (BJP) క్షేత్రస్థాయిలో హిందుత్వను బలంగా తీసుకెళ్తూ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అనేక పార్టీలను తనతో కలుపుకోవడానికి సిద్ధమైంది. మరోవైపు సినీ నటుడు విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింది. అయితే ఎన్నికల్లో అది ఏ మాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.