అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. భయపడటం లేదు.
లంచం తీసుకుంటుండగా ఓ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో కటకం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఓ వ్యక్తి సాదాబైనామా ద్వారా 8.35 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు వల పన్ని సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేసి, అతడిపై కేసు నమోదు చేశారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ వెబ్సైట్ (ACB Website)తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.