అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ఎక్సైజ్ శాఖలో పెద్ద స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. బుధవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో (Excise Department) మరో కుంభకోణానికి తెరలేపిందన్నారు. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. అందులో 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఒక్కొక్క బ్రూవరీ దగ్గర అన్అఫీషియల్గా రూ.1.80 కోట్లు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. వైన్ షాపుల లక్కీ డ్రా తియ్యకుండా కొందరికి టెండర్లు వచ్చాయని ఆరోపించారు.
Harish Rao | బ్రీజర్లు దొరకడం లేదు
లిక్కర్ సరఫరా (liquor supply) చేసే సంస్థలకు ప్రభుత్వం రూ.4,500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు ఇవ్వకపోవడంతో బ్రీజర్ సరఫరా రాష్ట్రంలో ఆగిపోయిందని చెప్పారు. చాలా షాపుల్లో బ్రీజర్ దొరకడం లేదన్నారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీతో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Harish Rao | రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని, కానీ బీరు కంపెనీలకు మాత్రం ఇస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సింగూర్ డ్యాం కింద రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. సంగారెడ్డిలో 40 వేల ఎకరాలకు నీరు అందించడం లేదని, ఘనపురం ఆనకట్ట 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉండే బీరు కంపెనీలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.