అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరాలు (Cyber Crimes) ఆగడం లేదు.
సోషల్ మీడియా (Social Media) , మీడియా, అవగాహన సదస్సుల ద్వారా నిత్యం పోలీసులు, కళాజాత బృందాలు సైబర్ నేరాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినా కూడా ప్రజలు మోసపోతూనే ఉండటం గమనార్హం. సైబర్ నేరాల బారీన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ విద్యుత్ ఉద్యోగి నుంచి సైబర్ దొంగలు రూ.13 లక్షలు కాజేశారు.
Cyber Fraud | ఏపీకే ఫైల్ పంపి..
సిరిసిల్ల జిల్లా (Sircilla District) బూర్గుపల్లిలో భాస్కర్ అనే వ్యక్తి లైన్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఆయన ఫోన్‌కు సైబర్ నేరస్తులు ఏపీకే ఫైల్ పంపారు. దానిని భాస్కర్ డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాక్ చేశారు. అనంతరం అతడి ఖాతాలో నుంచి రూ.13 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసు (Cyber Crime Police)లకు ఫిర్యాదు చేశారు. ఎక్కువ శాతం సైబర్ నేరాలు పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్ (Digital Arrest)ల పేరిట జరుగుతున్నాయి. వీటి భారిన చదువుకున్న వారే పడుతున్నారు.
ముఖ్యంగా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం అనగానే చాలా మంది అత్యాశకు పోయి నిందితులు చెప్పిన ఖాతాలకు డబ్బులు బదిలీ చేస్తున్నారు. తర్వాత మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. అలాగే డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టగానే పలువురు ఆందోళనకు గురై డబ్బులు పంపిస్తున్నారు. ఏపీకే ఫైళ్లను (APK Files) డౌన్లోడ్ చేసుకొవద్దని పోలీసులు చెబుతున్నా.. కొందరు వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలా ఎవరైనా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయగానే నిందితులు వారి ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. అనంతరం బాధితుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. వారి వాట్సాప్ నుంచి కాంటాక్ట్‌లకు ఏపీకే ఫైళ్లను షేర్ చేస్తున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.