అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MissTerious Movie Review | రోహిత్, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’ నేడు డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ నిర్మించిన (Producer Jay Vallandas)ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం (Director Mahi Komatireddy) వహించారు. విడుదలకు ముందే ప్రీమియర్స్ వేయడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
కథ :
రాంకీ (అబిద్ భూషణ్) ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా అతడు 15 రోజులుగా మిస్ అవుతాడు. ఈ కేసు ACP ఆనంద్ సాయి (బాల రజ్వాది)కి అప్పగించబడుతుంది. విచారణలో రాంకీ మిస్సయ్యే ముందు అక్రమంగా ఒక గన్ కొనుగోలు చేసిన విషయం బయటపడుతుంది. అంతేకాదు, అతని చివరి కాల్ శిల్ప (మేఘనా రాజ్ పుత్)కి వెళ్లిందని తెలుస్తుంది.
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాంకీ చివరిసారిగా శిల్ప ఇంటికి వెళ్లినట్టు ఆధారాలు లభిస్తాయి. పోలీసుల విచారణ మొదలైన క్రమంలో శిల్ప, ఆమె భర్త విరాట్ (రోహిత్) గోవాలో యాక్సిడెంట్‌కు గురైనట్టు సమాచారం వస్తుంది. దీంతో పోలీసులు మరోసారి శిల్ప ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండరు. అసలు శిల్ప – విరాట్ ఎవరు? వాళ్లకు రాంకీకి ఉన్న సంబంధం ఏంటి? రాంకీ అక్రమంగా గన్ ఎందుకు కొన్నాడు? గోవాలో ఉన్న శిల్ప అయితే పోలీసులతో మాట్లాడిన అమ్మాయి ఎవరు? రాంకీకి చివరకు ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల నటన :
రోహిత్, అబిద్ భూషణ్ తమ పాత్రల్లో బాగానే మెప్పించారు. మేఘనా రాజ్ పుత్, రియా కపూర్ గ్లామర్‌తో పాటు ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్‌లో సరైన నటన కనబరిచారు. ACP పాత్రలో బాల రజ్వాది, లక్ష్మీ శ్రీదేవి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జబర్దస్త్ రాజమౌళి నటన మాత్రం కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో పర్వాలేదనిపించారు. నటీనటులు అందరు తమ పాత్రలలో నటించి అలరించారు అనే చెప్పాలి.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా, కొన్ని సన్నివేశాల్లో ఇంకా బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. పాటలు వినడానికి ఓకే అయినా విజువల్‌గా బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్‌లో కొంత ల్యాగ్ తగ్గిస్తే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది. చిన్న బడ్జెట్ సినిమా అయినా నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.
నటీనటులు : రోహిత్, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్, బాల రజ్వాది
దర్శకత్వం : మహి కోమటిరెడ్డి
బేనర్ : అశ్లీ క్రియేషన్స్ బ్యానర్
సంగీతం : ఎంఎల్ రాజా
ప్లస్ పాయింట్స్:
రోహిత్, అభిద్ నటన
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువల
మైనస్ పాయింట్స్:
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఎడిటింగ్
కొన్ని సన్నివేశాలు
విశ్లేషణ :
ప్రముఖ నటీనటులు లేకపోయినా, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, ప్రమోషన్స్‌లో బ్రహ్మానందం పాల్గొనడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది పూర్తిగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller) జానర్‌కు చెందిన సినిమా.సినిమా ఎక్కువగా పోలీస్ విచారణ, ఫ్లాష్బ్యాక్లతో సాగుతుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల నెరేషన్ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ మొదటి నుంచే “ఏం జరుగబోతోంది?” అనే క్యూరియాసిటీని దర్శకుడు నిలబెట్టగలిగాడు.
ఫస్ట్ హాఫ్‌లో రాంకీ మిస్సింగ్ కేసు, విచారణ, శిల్ప – విరాట్ ఎంట్రీతో కథ ముందుకెళ్తుంది. ఇంటర్వెల్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ లేకుండా సింపుల్‌గా ముగుస్తుంది. అసలు కథా మలుపులు అన్నీ సెకండ్ హాఫ్‌లోనే మొదలవుతాయి. ఒక్కొక్కటిగా ట్విస్టులు రివీల్ అవుతూ ఆసక్తిని పెంచుతాయి. అయితే సీరియస్ కథ నడుస్తుండగా మధ్యలో పాటలు, కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ ల్యాగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా, సినిమా ప్రారంభంలో చూపించిన సన్నివేశాల వల్ల అది కొంతవరకు ఊహించగలిగేలా ఉంటుంది.
‘మిస్టీరియస్’ అనేది సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులకు ఓ మోస్తరు ఎంగేజింగ్ మూవీ. కొన్ని ల్యాగ్ మైనస్‌లు ఉన్నప్పటికీ, ట్విస్టులతో కథను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రేటింగ్ : 2.5 / 5