అక్షరటుడే, వెబ్డెస్క్ : Nutritional Biryani | బిర్యానీ అంటే ఇష్టముండనివారు ఉండరు. పిల్లలు మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే చాలా మందికి బిర్యానీ అంటే అధిక మసాలాలు, నూనె, ఉప్పుతో నిండిన రెస్టారెంట్ బిర్యానీ(Restaurant Biryani)యే గుర్తుకొస్తుంది.
ఘాటైన మసాలా ఎక్కువగా ఉన్న ఈ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యం(Health) చిన్నప్పటినుంచే దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అజీర్ణం, గ్యాస్ ట్రబుల్(Gas trouble), బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయంటున్నారు కామారెడ్డికి చెందిన సంకల్ప ఆయుర్వేద డైటీషియన్ శివాని(Dietician Shivani). ‘‘ఒక మొక్క బలంగా పెరగాలంటే బీజం దశనుంచే మంచి శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. అచ్చం అలాగే పిల్లల ఆరోగ్యం, అభివృద్ది విషయంలోనూ చిన్నతనం నుంచే పోషక విలువలున్న(Nutritional values) ఆహారం అందించాలి. రుచికరమైనది మాత్రమే కాకుండా శరీరానికి సహజ శక్తిని ఇచ్చే ఆహారం(Food) అవసరం’’ అని పేర్కొంటున్నారు. మసాలాలు లేకుండా, రకరకాల కూరగాయలు, తక్కువ నూనెలతో పోషక విలువలున్న ప్రకృతి బిర్యానీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇది శుచిగానే కాదు.. రుచిగానూ ఉంటుందని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని, రెస్టారెంట్(Restaurant)లో తయారు చేసే బిర్యానీలానే కనిపిస్తుందని పేర్కొంటున్నారు. మరి ప్రకృతి బిర్యానీ గురించి తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు..
- బియ్యం : పావు కిలో బియ్యం(Rice) తీసుకుని నానబెట్టాలి.
- కూరగాయలు : బీరకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్, బీట్‌రూట్, కాలీఫ్లవర్(Cauliflower), క్యాబేజీ, టొమాటో, పచ్చి బఠానీ. కొంత పాలకూర.
- నూనె : 2 చెంచాలు.
ఆవాలు, జీలుకర్ర(Cummin), మిరియాలు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు తగినంత.
తయారీ విధానం..
కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. బాణలిని స్టౌవ్(Stove)పై ఉంచి నూనె వేసి వేడి చేయాలి. తాళింపు గింజలు వేసి చిటపటలాడాక కరివేపాకు, పసుపు వేయాలి.
క్యారెట్, బీన్స్, దొండకాయ, చిక్కుడు, బీట్‌రూట్ లను వరుసగా వేసి వేగించాలి. నీళ్లు కొద్దిగా పోసి మూతపెట్టి ఉడికించాలి. తర్వాత కాలీఫ్లవర్, బీరకాయ వేసి వేయించాలి. ఉడికిన తర్వాత టొమాటో ముక్కలు, తరిగిన ఆకూకూరలు వేసి కలపాలి. నానబెట్టిన బియ్యం వేసి తగినంత నీరు పోయాలి. సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి.
ప్రకృతి బిర్యానీలో ఉండే పోషకాలు..
- విటమిన్ ఏ, బీ, సీ, ఈ ఉంటాయి.
- ఐరన్, కాల్షియం(Calcium), పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు లభిస్తాయి.
- కూరగాయల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది.
- కూరగాయలు, నూనెల ద్వారా ప్రొటీన్లు(Protein) లభిస్తాయి.
- మసాలాలు లేకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు.
- జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కొవ్వు తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది.