అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Maha Jathara 2026 | వనమంతా జన సందడి నెలకొంది. మేడారం మహా జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. అమ్మలు గద్దెలపై కొలువు దీరడంతో శుక్రవారం మేడారం భక్త జనసంద్రంగా మారింది.
వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు (Devotees) భారీగా బారులు తీరారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మహాజాతరలో భాగంగా గురువారం రాత్రి సమ్మక్క (Sammakka) గద్దెపైకి వచ్చారు. అప్పటి నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. కొత్తగా నిర్మించిన క్యూ లైన్ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. దీంతో రోడ్డుపైన సైతం భక్తులు బారులు తీరారు.
Medaram Maha Jathara 2026 | భారీగా ట్రాఫిక్ జామ్
భక్తులు జంపన్న వాగు (Jampanna Vagu) లో పుణ్య స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో జంపన్న వాగు పరిసరాలు, గద్దెల ప్రాంతంలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఎటూ చూసిన జనమే కనిపిస్తున్నారు. వన దేవతల నామస్మరణతో జాతర మారుమోగుతోంది. మరోవైపు శివసత్తుల పూనకాలతో హోరెత్తుతోంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) నెలకొంది. తాడ్వాయి నుంచి మేడారం మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Medaram Maha Jathara 2026 | వీఐపీల తాకిడి
మేడారం జాతరకు భారీగా వీఐపీలు హాజరు అవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ (British Deputy High Commissioner) గారెత్ విన్ ఓవెన్ శుక్రవారం అమ్మవార్లను దర్శించుకున్నారు. నిలువెత్త బంగారం సమర్పించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క మేడారం మహా జాతర ప్రాముఖ్యత, కొత్తగా నిర్మించిన గద్దెలు, గిరిజన చరిత్ర భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయనకు వివరించారు.
