అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | చాలా మంది యువత కండలు పెంచుకోవాలని ఆశ పడుతారు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్‌లకు వెళ్తుంటారు. అయితే జిమ్‌లో ఎంత శ్రమించిన కండలు రాకపోవడంతో కృత్రిమంగా వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అనేక జిమ్‌లు ఉన్నాయి. చాలా మంది యువత సినిమాలు, సోషల్ మీడియా (Social Media)లో చూసి కండలు పెంచుకోవడానికి జిమ్‌లకు వెళ్తున్నారు. అయితే జిమ్‌లో ఎంత ప్రయత్నించినా.. కండలు తిరిగిన యోధులుగా కొందరు మారలేకపోతున్నారు. ఇలాంటి వారిని జిమ్ ట్రైనర్లు (Gym Trainers) పక్కదారి పట్టిస్తున్నారు. ఇంజెక్షన్లు, పౌడర్లు ఇచ్చి బాడీ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు తీసుకొని బాడీ పెంచుకుంటున్నారు. అయితే వీటి వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హార్ట్ఎటాక్ ముప్పు వీరికి అధికంగా ఉంటుంది. అనుమతి లేకుండా స్టెరాయిడ్స్ (Steroids) విక్రయించడానికి వీలు లేదు. అయితే కొందరు జిమ్ ట్రైనర్లు కొందరు వీటిని అక్రమంగా తెప్పించి యువతకు ఇస్తున్నారు. తాజాగా పోలీసులు స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Hyderabad | భారీగా స్టెరాయిడ్స్ స్వాధీనం
వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Task Force Police) ఎటువంటి వైద్య ప్రిస్క్రిప్షన్ లేకుండా యువకులకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను అక్రమంగా అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. స్టెరాయిడ్ దుర్వినియోగం వ్యసనం, అవయవ నష్టం, వంధ్యత్వం, మరణానికి కూడా దారితీస్తుంది. ఫర్నిచర్ వ్యాపారంలో పనిచేసే, తరచుగా జిమ్‌కు వెళ్లే మొహమ్మద్ ఫైసల్ ఖాన్ (25) వేగంగా కండరాల పెరుగుదల కోసం యువతలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల డిమాండ్ గురించి తెలుసుకున్నాడు. ఈ డిమాండ్‌ను ఉపయోగించుకుని, అతను సూరత్ నుంచి అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సేకరించి, తెలిసిన వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అత్తాపూర్‌లోని ఏషియన్ థియేటర్ (Attapur Asian Theatre) సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సిరంజిలు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.