అక్షరటుడే, వెబ్డెస్క్: Kakinada | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కంటైనర్ను లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకరు సజీవ దహనం అయ్యారు.
కాకినాడ జిల్లా కత్తిపూడి (Kathipudi) సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ యూ టర్న్ తీసుకుంటుంగా.. మరో లారీ కంటైనర్ ఢీకొంది. ఆ సమయంలో రెండు వాహనాలు నెమ్మదిగా ఉన్నాయి. అయితే కంటైనర్ను డీజిల్ ట్యాంక్ వద్ద ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు లారీల క్యాబిన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు లారీల డ్రైవర్లు బయటకు దూకారు. అయితే వెనకనుంచి ఢీకొన్న కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పి వేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Kakinada | హైదరాబాద్లో కారు దగ్ధం
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) లోని నార్సింగి సర్వీస్ రోడ్డుపై ఒక కారులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అశ్విన్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా.. నార్సింగి రౌండ్అబౌట్ సమీపంలో ఒక్కసారిగా ఆగిపోయింది. కారును తనిఖీ చేస్తుండగా, అతనికి మంటలు కనిపించడంతో వెంటనే బయటకు వచ్చాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు వాహనమంతటా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.