అక్షరటుడే, వెబ్డెస్క్ : Karimnagar | కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఈ రోజు ఉదయం విషాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే హుజురాబాద్ (Huzurabad) నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న రోడ్డుపై మున్సిపల్ సిబ్బంది డివైడర్లలో మట్టి పోస్తూ ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలిపి ఉంచారు. ఈ సమయంలో వేగంగా బైక్‌పై వస్తున్న యువకుడు ట్రాక్టర్‌ను గమనించకపోవడంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది.
Karimnagar | నిండు ప్రాణం బలి..
పోలీసుల సమాచారం ప్రకారం, హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేములవాడ (Vemulawada) అక్షయ్ సాయి (18) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఉదయం తన స్నేహితుడిని తీసుకురావడానికి రంగాపూర్ గ్రామానికి (Rangapur Village) బయల్దేరాడు. గెలాక్సీ సూపర్ మార్కెట్ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అక్షయ్ సాయిని స్థానికులు వెంటనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం సమయంలో మంచు ఎక్కువగా ఉండటం వల్ల దూరం నుంచే ట్రాక్టర్ కనిపించలేదని, అంతేకాకుండా అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేదా లైట్లు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యువకుడి మరణ వార్తతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను రోడ్డుపై నిలిపిన మున్సిపల్ సిబ్బంది (Municipal Staff)పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
