అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajasthan Police | గణతంత్ర దినోత్సవం (Republic Day) వేళ రాజస్థాన్‌లో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నాగౌర్ పోలీసులు (Nagaur Police) శనివారం రాత్రి ఒక ఫామ్‌హౌస్‌పై దాడి చేసి దాదాపు 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వ, పేలుడు పదార్థాల రవాణా ఆరోపణలపై ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఎందుకు నిల్వ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది వినాశకరమైన పరిణామాలకు దారితీసి ఉండవచ్చని ఒక పోలీసు అధికారి తెలిపారు. నాగౌర్ జిల్లాలోని తన్వాలా పోలీస్ స్టేషన్ (Tanwala Police Station) ప్రాంతంలోని సర్హాద్ హర్సౌర్ గ్రామంలోని వ్యవసాయ భూమిలో నిర్మించిన ఇంట్లో భారీగా పరిమితమైన పేలుడు పదార్థాలను దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
Rajasthan Police | అక్రమ మైనింగ్ కోసం..
జిల్లా ప్రత్యేక బృందం (DST), తన్వాలా పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఫామ్‌హౌజ్‌పై దాడి చేశారు. 187 అమ్మోనియం నైట్రేట్ సంచులను, భారీగా డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సులేమాన్ ఖాన్ (58)గా గుర్తించారు. అతడిపై గతంలో మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు, వాటిని ఎందుకోసం నిల్వ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం వీటిని నిల్వ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.