అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తునే.. మరోవైపు దుకాణాలపై దాడులు చేస్తున్నారు.
సంక్రాంతి (Sankranthi) సమీపిస్తుండటంతో చిన్నారులతో పాటు యువత సైతం జోరుగా గాలిపటాలు ఎగుర వేస్తున్నారు. అయితే చాలా మంది చైనా మాంజా వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తెగిపోయిన చైనా మాంజా (China Manja)తో ప్రజలతో పాటు, పక్షులకు సైతం ముప్పు పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం చైనా మాంజా విక్రయాలపై గతంలోనే నిషేధం విధించింది. అయినా కూడా పలువురు అక్రమంగా చైనా మాంజా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. యువత సైతం కొనుగోలు చేస్తున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి చర్యలు చేపడుతున్నారు.
Hyderabad | టాస్క్ఫోర్స్ సోదాలు
చైనా మాంజా నియంత్రణపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) ఫోకస్ చేశారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో నిత్యం సోదాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజాను పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు దుకాణాదారులపై కేసులు నమోదు చేశారు. సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు చేసి, 46 మందిని అరెస్ట్ చేశారు. నగరవ్యాప్తంగా చైనా మాంజాను అమ్ముతున్నవారిపై 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అదుపులోకి తీసుకున్నారు.