అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Youtuber Jyoti | పాకిస్తాన్(Pakistan)కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్, టూరిస్ట్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే అనేక కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులకు.. తాజాగా ఆమె పాకిస్థాన్ టూర్‌కి సంబంధించి రాసుకున్న డైరీ(Diary) దొరికింది. ఆ డైరీ ఆధారంగా అధికారులకు మరిన్ని రహస్యాలు తెలిసొచ్చాయి. జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ, ఐబీ అధికారులు ప్రశ్నిస్తుండగా, మరోవైపు హర్యానా పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకోవడంతో ఆమె పాకిస్థాన్ పర్యటన గురించి మరింత కీలక సమాచారం దొరికినట్లయింది.
గూఢచర్యం ఆరోపణల కింద మే 16న జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారిస్తున్నారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(Pakistani Intelligence Operatives)తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మల్హోత్రాను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు పాకిస్థాన్, చైనా సహా ఆమె చేసిన పర్యటనల వివరాలను సేకరిస్తున్నారు.
Youtuber Jyoti | రంగుల ప్రపంచం పాక్..
గతేడాది పాకిస్తాన్‌లో పర్యటించిన జ్యోతి.. తన డైరీలో కీలక విషయాలు రాసుకున్నారు. తేదీ లేని డైరీ ఎంట్రీలలో, పాకిస్థాన్ పర్యటన నుంచి “నా దేశం” భారతదేశానికి తిరిగి వచ్చినట్లు ప్రస్తావించింది. “ఈ సమయంలో, నేను పాకిస్థాన్ ప్రజల నుంచి చాలా ప్రేమను పొందాను. సబ్‌స్క్రైబర్లు, స్నేహితులు కూడా మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్(Lahore)ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు” అని తన డైరీలో రాసుకుంది. పాకిస్థాన్‌ను “క్రేజీ”, “రంగురంగుల పాకిస్థాన్” అని అభివర్ణించింది. పొరుగు దేశంలో తన అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని రాసుకుంది. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ అధికారులకు చేసిన అభ్యర్థననూ ఒకచోట రాసింది. “అక్కడి దేవాలయాలను రక్షించండి. 1947లో భారతీయులు తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారి ఫ్యామిలీస్‌ను కలవనివ్వండి” అని పేర్కొంది.
Youtuber Jyoti |అన్నీ అనుమానాలే..
33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా నడుపుతున్న ‘ట్రావెల్ విత్ జో’ (Travel with Joe’) అనే యూట్యూబ్ ఛానల్‌కు 3.77 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మే 16న హిసార్‌లోని ఆమె నివాసంలో దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన పాకిస్తానీ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్(Danish)తో నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకూ మల్హోత్రా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నట్లు హర్యానా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
దర్యాప్తు సంస్థలు పర్సనా నాన్ గ్రాటా(అప్రియమైన వ్యక్తి)గా ప్రకటించిన డానిష్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అలీ అహ్వాన్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత అలీ.. జ్యోతి మల్హోత్రాకు పాక్‌లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు, పాకిస్థాన్ భద్రతా అధికారులు షకీర్, రాణా షాబాజ్‌లకూ పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. జ్యోతి మల్హోత్రాపై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం తెలుస్తోన్నదేంటంటే, తనపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండటానికి జ్యోతి.. షకీర్ నెంబర్ ను తన ఫోన్‌లో “జాట్ రంధావా”గా సేవ్ చేసింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత, మల్హోత్రా.. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా వాళ్లతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నట్లు తెలిసింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో డానిష్(Pakistan High Commission Danish)ను ఆమె చాలాసార్లు కలిసింది.
Youtuber Jyoti | ఆలయాల వద్ద రెక్కీ
దేశంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద జ్యోతి రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఆలయాల పరిసరాల్లో వీడియోలు తీసిన జ్యోతి వాటిని పాక్‌కు చేరవేసింది. దీంతో జ్యోతితో పరిచయాలున్న యూట్యూబర్లను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా జ్యోతి రీల్స్, వీడియోలు చేసింది.