అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarkurnool | వివాహేతర సంబందాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. తాత్కాలిక ఆనందం కోసం కొందరు కట్టుకున్న వారిని కడ తేరుస్తున్నారు.పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు దారి తప్పారు.
గురువు బాధ్యతలో ఉన్న వారు క్రమశిక్షణతో మెలగాల్సింది పోయి అడ్డదారి తొక్కారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఇద్దరు టీచర్లు వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్నారు. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన భర్తను హత్య చేసింది. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు నటించింది.
Nagarkurnool | అడ్డుగా ఉన్నాడని..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో లక్ష్మణ్ నాయక్(38), పద్మ(30) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మ 2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా (Battukadipalle Thanda) ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని పద్మ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ప్రియుడు గోపితో కలిసి గత నెల 24న రాత్రి పడుకొని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిపై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చంపేసింది.
Nagarkurnool | అనుమానాస్పద మృతిగా కేసు
లక్ష్మణ్ నాయక్‌ను చంపేసిన పద్మ మరుసటి రోజు ఉదయం ఏమి కానట్లు పాఠశాలకు వెళ్లింది. అనంతరం ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని చెప్పింది. దీంతో వారు వెళ్లి చూడగా ఆయన విగతజీవిగా పడి ఉన్నాడు. అనంతరం పద్మ ఇంటికి వచ్చింది. తాను ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని పద్మ నటించింది. అయితే తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో పోలీసులు భార్యపై అనుమానంతో విచారించగా అసలు నిజం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగిందని గుర్తించిన పోలీసులు నిందితులు పద్మ, గోపిలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పాఠాలు చెప్పాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు చేసిన పాడు పనితో జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.