అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌కల్యాణ్ చోటు సంపాదించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తున్నారని, ఎన్డీయే ను బలోపేతం చేస్తున్నారన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మోదీ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు(Pawan Kalyan Birthday) సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రుడు పవన్ కల్యాణ్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం.. అణువణువునా సామాజిక స్పృహ.. మాటల్లో పదును… చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకు కట్టుబడే తత్వం. రాజకీయాల్లో విలువలకు పట్టం…. స్పందించే హృదయం… అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్థిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది’ అని సీఎం చంద్రబాబు(CM Chandra Babu) సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Pawan Kalyan | విషెస్ చెప్పిన మంత్రులు
మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ఏపీ మంత్రి నారా లోకేష్(AP Minister Nara Lokesh) పేర్కొన్నారు. అలాగే, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇక, ఆయన అభిమానులు కూడా తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానాలు, అన్నదానాలు చేశారు.