అక్షరటుడే, వెబ్‌డెస్క్: Siddipet | సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
బెజ్జంకి మండలం (Bejjanki mandal) దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు. వీరికి ఒక కమార్తె ఉంది. శ్రీహర్ష తమ బంధువు అయిన పల్లె అనిల్‌కు వ్యాపారం చేసుకోవడానికి అప్పు ఇచ్చాడు. తనకు తెలిసిన వారి దగ్గర లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించాడు. అయితే అనిల్ ఆ డబ్బులను తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు శ్రీహర్షపై ఒత్తిడి (pressure) చేశారు.
Siddipet | పరువు పోతుందని..
అభిలాష్, భూపతిరెడ్డి అనే వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని శ్రీహర్షను తరచూ బెదిరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. కొంత సమయం కావాలని కోరినా వారు ఒప్పుకోలేదు. దీంతో గ్రామంలో పరువు పోతుందని భావించిన శ్రీహర్ష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి పురుగుల మందు తాగాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
దంపతుల మృతి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులకు ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. వడ్డీలు కడుతున్నా.. అప్పు ఇచ్చిన అభిలాష్, భూపతిరెడ్డి వేధించడంతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారు లేఖ రాశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.