అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | అవినీతి రహిత మున్సిపాలిటీ బీజేపీతోనే సాధ్యమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కోసం బుధవారం ప్రచార రథానికి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
MLA KVR | ప్రజలకు అందుబాటులో ఉంటూ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే వారినే కౌన్సిలర్‌గా గెలిపించాలన్నారు. గతంలో మున్సిపాలిటీని అవినీతి ఊబిలోకి నెట్టారని, రూ. కోట్ల అప్పులు చేస్తే ఇప్పుడిప్పుడే మున్సిపాలిటీ అప్పుల నుంచి కోలుకుంటుందన్నారు. గత రెండేళ్లలో మున్సిపాలిటీలో అవినీతి తగ్గిందని, దానిని పూర్తిగా రూపు మాపడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.
MLA KVR | గత పాలకవర్గాల హయాంలో..
గత పాలకవర్గాల హయాంలో బడాబాబులు బకాయిలు చెల్లించలేదని, తాను గెలిచాక ఏడాదికి రూ.6 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు రూ.16 కోట్లకు పెంచామని కేవీఆర్ అన్నారు. పన్నులు సరిగ్గా చెల్లిస్తే మున్సిపాలిటీకి ఏటా రూ.24 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.16 నుంచి రూ.18 కోట్లు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు ఇస్తుందని, ఇవన్నీ కలిపితే మున్సిపాలిటీకి ప్రతి ఏడాది రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నుంచి రూ. 16 కోట్ల ఖర్చు పోయినా మిగతా ఆదాయంతో వార్డుకు రూ.75 లక్షల చొప్పున కేటాయిస్తే మూడేళ్లలో సమస్యలు దూరం అవుతాయన్నారు. ఈ విధంగా ఆదాయం వచ్చి వార్డుల అభివృద్ధి జరగాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో నీతి, నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.