అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Air Pollution | ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు తీవ్రం అవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. కాలుష్యం కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) నిర్మాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాజధాని, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) అంతటా తీవ్రమైన కాలుష్య స్థాయిల మధ్య నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో దెబ్బతిన్న కార్మికులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించడం కోసం పరిహారం ఇవ్వనున్నారు.
Delhi Air Pollution | 16 రోజులుగా..
వాయు కాలుష్యం కారణంగా.. ఢిల్లీలో 16 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వంలో నమోదు చేసుకున్న కార్మికులకు మాత్రమే ఈ డబ్బులు అందుతాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి కపిల్ మిశ్రా (Minister Kapil Mishra) తెలిపారు. ఢిల్లీ పేలవమైన గాలి నాణ్యతతో పోరాడుతున్నందున ఈ సీజన్లో నిర్మాణ కార్మికులు పదేపదే అంతరాయాలను ఎదుర్కొన్నారు. చాలా మంది రోజువారీ కూలీలు ఇప్పటికే అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నారు.
Delhi Air Pollution | వర్క్ ఫ్రమ్ హోమ్
ఢిల్లీలో రోజురోజుకు గాలినాణ్యత పడిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తమ సిబ్బందిలో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని మిశ్రా ప్రకటించారు. ఈ చర్య ఆస్పత్రులు, కాలుష్య నియంత్రణలో పాల్గొన్న విభాగాలు, అగ్నిమాపక శాఖ మరియు ఇతర ముఖ్యమైన సేవలకు వర్తించదు. శీతాకాలపు పొగమంచు, ప్రశాంతమైన గాలులు, కాలుష్య కారకాల చేరడంతో ఢిల్లీ గాలి నాణ్యత క్షీణిస్తోంది. గాలిలో హానికరమైన కణ పదార్థాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా నిర్మాణాలపై నిషేధాలు, పాత డీజిల్ వాహనాలపై (Old Diesel Vehicles) పరిమితులు విధించారు.