అక్షరటుడే, వెబ్‌డెస్క్ : President Murmu Helicopter | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ ల్యాండింగ్ అనంతరం కుంగిపోయింది. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
రాష్ట్రపతి ముర్ము కేరళ (Kerala) పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం మంగళవారం సాయంత్రం ఆమె కేరళ చేరుకున్నారు. బుధవారం ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) దర్శనానికి ఆమె బయలు దేరారు. కేరళలోని పతనంతిట్ట సమీపంలోని ప్రమదం ప్రాంతంలో ఆమె హెలికాప్టర్ ల్యాండ్ అయింది. హెలిప్యాడ్ కుండిపోవడంతో హెలికాప్టర్ టైర్లు దిగబడి, ఓ వైపు ఒరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాష్ట్రపతి (President Murmu)ని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. అనంతరం హెలికాప్టర్ (Helicopter)ను నెట్టుకుంటూ పక్కకు చేర్చారు.
President Murmu Helicopter | హడావుడిగా హెలిప్యాడ్ పనులు
రాష్ట్రపతి రావడానికి కొన్ని గంటల ముందు హెలిప్యాడ్ పనులు పూర్తయినట్లు సమాచారం. హడావుడిగా పనులు చేపట్టడంతో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ టైర్లు కాంక్రీట్‌లో కుంగిపోయాయి. అయితే ముర్ము నిలక్కల్‌లో దిగాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చివరి నిమిషంలో ప్రణాళికను మార్చారు. దీంతో హెలిప్యాడ్ పనులు హడావుడిగా చేపట్టారు. అయితే సురక్షితంగా బయటకు వచ్చిన ఆమె రోడ్డు మార్గంలో పంపాకు తన ప్రయాణాన్ని కొనసాగించారు.
President Murmu Helicopter | శబరిమలలో ఆంక్షలు
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శబరిమలలో అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆమె గణపతి ఆలయం (Ganapati Temple)లో జరిగే వేడుకలో ఇరుముడిని సిద్ధం చేసి, గూర్ఖా అత్యవసర ఫోర్-వీల్-డ్రైవ్ వాహనంలో సన్నిధానానికి వెళ్తారు. ఆరు వాహనాల ఎస్కార్ట్‌తో పాటు, రాష్ట్రపతి సన్నిధానం చేరుకుంటారు. అక్కడ తంత్రి కందరుడు మహేష్ మోహనరు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం రాష్ట్రపతి 18 పవిత్ర మెట్లు ఎక్కి అయ్యప్పకు పూజలు చేస్తారు. ఆచారాల తర్వాత ఆమె దేవస్థానం అతిథి గృహంలో విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం తర్వాత తిరుగు పయనం అవుతారు. రాష్ట్రపతి తన సందర్శన ముగించుకుని బయలుదేరే వరకు యాత్రికులను నిలక్కల్ దాటి అనుమతించరు.