అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | వందేళ్ల నాటి పోచారం ప్రాజెక్టు (Pocharam project) భారీ వరద ఉధృతికి తట్టుకొని నిలబడింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.
జలాశయంలోకి ఎన్నడూలేని విధంగా లక్షా 50వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో ప్రాజెక్టు అలుగు పైనుంచి 8 అడుగుల మేర వరద పొంగిపొర్లింది. అయితే ప్రాజెక్టులో ఓవర్ హెడ్ వద్ద మట్టికొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టు పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కానీ మట్టి కొట్టుకుపోయిన ఆనవాళ్లు తప్ప ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు వాటిళ్లలేదు.
1917లో నవాబ్ అలీ జంగ్ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది వేశారు. మంచిప్ప వాగుపై 1922లో పోచారం ప్రాజెక్టును అప్పటి నిజాం ప్రభుత్వం (Nizam government) పూర్తి చేసింది. అప్పటి నుంచి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయనిగా పోచారం నీళ్లు అందిస్తూ అన్నదాతలకు అన్నపూర్ణగా మారింది. పోచారం ప్రాజెక్టు 70వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టులోని నీటిని ఏ జోన్, బీ జోన్‌గా విభజించి 12వేల ఎకరాలకు సాగునీరందించేలా దీనిని రూపొందించారు.
నాటినుండి నేటి వరకు ఏ ప్రభుత్వాలు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదు. అప్పటి నిర్మాణాలు అంత నాణ్యతగా ఉండడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు నిలబడింది. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటివరకు 70,000 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చింది.
అయితే రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 1,50,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు పైనుంచి ఉధృతంగా ప్రవహించడంతో ప్రాజెక్టు గండి పడడం ఖాయమని అధికారులు ప్రజలు ఆందోళన చెందారు. లోతట్టు ప్రాంతాలలో వారిని సైతం అప్రమత్తం చేశారు.
రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. కానీ నిజాం ప్రభుత్వం నిర్మించిన పోచారం ప్రాజెక్టు (Pocharam project) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెక్కుచెదరకుండా అంతటి ఉధృతిని తట్టుకొని సేఫ్‌గా నిలిచింది. ప్రాజెక్టు సైడ్ వాల్ వద్ద కుంగిపోయిన మట్టిని నింపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి మట్టిని నింపేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.