అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | గెలిచిన రోజు నుంచే ప్రత్యర్థులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ డిమాండ్ చేశారు. సోమార్పేట్ (Somarpet) సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన బాలరాజు ఇంటిపై సోమవారం ఉదయం కొందరు ట్రాక్టర్‌తో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాడిచేసిన వారిని శిక్షించకుండా రాచ మర్యాదలు చేస్తున్నారని పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yellareddy | కక్షపూరితంగానే ఈ దాడి..
కక్షపూరితంగానే ఇంటిపై ట్రాక్టర్‌తో తొక్కించే ప్రయత్నం చేసిన వారిని వదిలేసి బాధితులపై పోలీసులు జులూం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధిత కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎల్లారెడ్డి నిజాంసాగర్ రహదారిపై (Nizamsagar Road) నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దాడిలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Yellareddy | హైదరాబాద్ నుంచి నేరుగా..
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Former MLA Nallamadu Surender) హైదరాబాద్ నుంచి హుటాహుటిన తరలివచ్చి బాధితులను పరామర్శించారు. అనంతరం రాస్తారోకోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా గుండాయిదాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. సోమార్పేట్ సర్పంచ్‌గా గెలుపొందిన అభ్యర్థిని సైతం పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Yellareddy | కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్..
నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో చేయడం వల్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై డీఎస్పీ శ్రీనివాసరావు (DSP Srinivas Rao), సీఐ రాజారెడ్డి (CI Raja Reddy), ఎస్సై మహేష్ (SI Mahesh) బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో డీఎస్పీ మాజీ ఎమ్మెల్యే సురేందర్‌కు ఎస్పీతో మాట్లాడించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే రిమాండ్ చేయాలని ఎస్పీని మాజీ ఎమ్మెల్యే కోరారు. వారిని రక్షించే ప్రయత్నం చేస్తే మళ్లీ రాస్తారోకో చేపడతామని స్పష్టం చేశారు. ఎస్పీతో మాట్లాడిన అనంతరం బాధితులు ఆందోళన విరమించారు.