అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ (SI Mahesh) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 14న పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) సోమార్పేట్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా బాలరాజు, కుర్మ పాపయ్య పోటీ చేశారు. ఎన్నికల్లో బాలరాజు ఓడిపోయాడు.
అయితే బిట్ల బాలరాజు తాను నామినేషన్ వేసినప్పటి నుండి తన ప్రత్యర్థి అయిన కురుమ పాపయ్య, అతడి బంధువులైన కురుమ సాయిబాబా, కురుమ శంకర్, కురుమ చిరంజీవి, కురుమ స్వప్న, కురుమ లత, కురుమ శోభ, కురుమ దుర్గవ్వలు బాలరాజును బెదిరించారు. ఎన్నికల్లో ఓడిపోతే బాలరాజు అంతు చూస్తామని బెదిరించారు. ఈ క్రమంలో బాలరాజు ఓడిపోయాడు.
బాలరాజు ఓడిన అనంతరం 15వ తేదీ ఉదయం తన ఇంటి వద్ద మద్దతుదారులతో మాట్లాడుతండగా.. అదే గ్రామానికి చెందిన కురుమ చిరంజీవి తన ట్రాక్టర్‌తో ఫిర్యాది అయిన బాలరాజును ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటనలో బాలరాజు తప్పించుకోగా.. అక్కడే ఉన్న బండి భారతి, బండమీద బాలమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. పద్మ సత్తవ్వ, తోట శారద, గండి అద్విత్లకు గాయాలయ్యాయి. వెంటనే గాయాలపాలైన ఐదుగురిని ఆస్పత్రులకు తరలించారు. ఈ సంఘటన కారణమైన వారిపై బాలరాజు ఫిర్యాదు చేయగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.