అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kotha Prabhakar Reddy | దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. దుర్గం చెరువు (Durgam Cheruvu) ఆక్రమించారని ఆయనపై హైడ్రా ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మాదాపూర్‌లో గల దుర్గం చెరువు ఆక్రమణలకు గురైన విషయం తెలిసింది. డిసెంబర్ 30న హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి చెరువును ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madhapur Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు.
Kotha Prabhakar Reddy | నెలకు రూ.50 లక్షల సంపాదన
బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి దుర్గం చెరువులో మట్టి, రాళ్లు నింపి అక్రమంగా ప్రైవేటు పార్కింగ్ దందా చేశారని హైడ్రా పేర్కొంది. 2014 నుంచి దుర్గం చెరువును కబ్జా చేసినట్లు ఫిర్యాదు చేసింది. హెచ్ఎండీఏ 2014 దుర్గం చెరువు ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు చెరువు ప్రాంతంలో సుమారు 5 ఎకరాలు ఆక్రమించారు. ఆ భూమిని ఎస్టీఎస్ ప్రైవేట్ రవాణా పార్కింగ్ కోసం ఉపయోగించుకుంటూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. స్కూల్ బస్సులు, ఐటీ సంస్థలకు చెందిన వాహనాల పార్కింగ్తో ప్రతి నెల రూ. 50 లక్షల వరకూ అద్దెలు వసూలు చేస్తున్నారని హైడ్రా (Hydraa) పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kotha Prabhakar Reddy | కబ్జాల తొలగింపు
మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా మంగళవారం తొలగించిన విషయం తెలిసిందే. ఆ స్థలంలో పార్క్ చేసిన వాహనాలను ఖాళీ చేయించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. అక్కడ మట్టిని తొలగించడానికి సైతం చర్యలు చేపట్టింది. కాగా 160 ఎకరాల్లో విస్తరించి ఉన్న దుర్గం కబ్జాలతో ప్రస్తుతం 116 ఎకరాలకు కుచించుకుపోయింది. మాదాపూర్‌లో భూములకు భారీగా డిమాండ్ ఉండటంతో పలువురు ఆక్రమణలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)పై కేసు నమోదు కావడం గమనార్హం.