అక్షరటుడే, హైదరాబాద్: BRS | భారత రాష్ట్ర సమితి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వరుసగా చుట్టుముట్టిన సమస్యలతో సతమతమవుతోంది. ఇంటా, బయట ఆధిపత్య పోరుతో అధినేత కేసీఆర్‌కు తలబొప్పి కడుతోంది. పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణం బీఆర్ఎస్ పాతికేళ్ల ప్రస్థానంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఓ వైపు కవిత ధిక్కార స్వరం, మరోవైపు, విచారణల పర్వం, ఇంకోవైపు పక్క చూపులు చూస్తున్న అనుచర వర్గం, బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం.. ఇలా అన్ని రకాల సమస్యలు వెంటాడుతుండడం బీఆర్ఎస్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రధానంగా బీజేపీ(BJP)లో విలీనం చేస్తారన్న ప్రచారం ఆ పార్టీకి తీవ్ర శరాఘాతంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్సీ కవితతో పాటు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.
BRS | నేతల పక్కచూపులు
అధికారం కోల్పోయి, ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న బీఆర్ఎస్‌కు నేతల కప్పదాట్లు ఇబ్బందికరంగా పరిణమించాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారు. మరికొందరు కూడా జంప్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొంత మంది కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు తాజాగా వెల్లడించడం గులాబీ పార్టీలో కలవరం రేపింది.
BRS | బీజేపీలో విలీన ప్రచారం..
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం.. పార్టీ నేతలు, కార్యకర్తలను గందరగళానికి గురి చేస్తోంది. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి పని చేసిన కారణాల్లో ఈ ప్రచారం కూడా ఓ కారణమే.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఓటర్లలోకి బాగా వెళ్లింది. లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడం, ఆమెను బెయిల్‌పై తీసుకొచ్చేందుకు బీజేపీతో చర్చలు జరిపిన ముఖ్య నేతలు పార్టీ విలీనానికి సిద్ధపడడం గులాబీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. విలీనం వార్తలను కీలక నేతలు కొట్టి పడేస్తున్నప్పటికీ, కేడర్‌లో మాత్రం గందరగోళం కొనసాగుతోంది.
బీజేపీలో విలీనానానికి సిద్ధపడ్డారని ఎమ్మెల్సీ కవితనే (MLC Kavita) స్వయంగా వెల్లడించడం బీఆర్ఎస్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీసింది. అదే సమయంలో కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ను (BJP MP CM Ramesh) అనవరసరంగా వివాదంలోకి లాక్కురావడంతో ఆయన కూడా అనేక కీలక విషయాలు బయటపెట్టారు.
బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధపడ్డారని, దీనిపై అధిష్ఠానంతో మాట్లాడాలని కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చారని ఆయన ప్రకటించడంతో విలీన ప్రయత్నాలు నిజమేనన్నది తేలిపోయింది.
BRS | కవిత తిరుగుబాటు బావుట..
అధికారం కోల్పోయి అవస్థల్లో చిక్కుకున్న బీఆర్ఎస్‌కు కవిత రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ ఇంట్లోనే నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీలో గందరగోళానికి దారితీసింది. కవిత తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం కావడం, ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం గులాబీ శ్రేణుల్లో కలవరం రేపింది. కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని, పార్టీలో మిగతా వారు ఎవరూ నాయకత్వం చేపట్టే స్థాయికి ఎదగలేదని కవిత చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
మరోవైపు, వివిధ అంశాలపై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఆమెను పార్టీ నుంచి అనధికారికంగా బహిష్కరించారు. బీఆర్ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటున్న ఆమె కూడా తన రాజకీయ ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. పార్టీ అధినేత బిడ్డల మధ్యే ఆధిపత్య పోరు నెలకొనడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది.
BRS | వరుస విచారణలు..
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో జరిగిన అంతులేని అవినీతిపై రేవంత్ సర్కారు విచారణలకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు రూ.లక్ష కోట్లు వెచ్చించిన నిర్మించిన కాళేశ్వరం, గొర్రెల కుంభకోణం, ఈ కార్ రేస్ వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లు తదితర అంశాలపై విచారణ చేపట్టింది.
ఇప్పటికే విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ పూర్తికాగా, ఇటీవలే కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక సమర్పించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. పక్కా ఆధారాలు లభించడంతో బీఆర్ఎస్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్‌లో ముఖ్య నేతలు అరెస్టు కావడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైనా అరెస్టులు జరిగే అవకాశముందని.. కానీ భయపడాల్సిన అవసరం లేదని ఇటీవలే కేసీఆర్ తనను కలిసిన నేతలతో చెప్పడం గమనార్హం. అదే పరిస్థితి తలెత్తితే ఇప్పటికే వరుస సంక్షోభాలతో సతమతమవుతున్న పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కానుంది.
BRS | ఫామ్ హౌస్ దాటని అధినేత
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS party leader KCR) ఫామ్ హౌస్‌ను దాటి బయటకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ప్రజా జీవితానికి దాదాపు దూరమయ్యారు. ఒక్క పార్లమెంట్ ఎన్నికల సమయంలో మినహా ఆయన పెద్దగా బయటకు రాలేదు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ముందుకు హాజరైన సందర్భంలో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించిన సమయంలో, ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరినప్పుడు మాత్రమే ఆయన బయట కనిపించారు తప్పితే, అసలు బయటకు రావడమే మానేశారు. కనీసం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు కూడా రావడం లేదు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సమయంలో త్వరలోనే ప్రెస్‌మీట్ పెడతానని చెప్పిన ఆయన ఇప్పటిదాకా సమావేశం పెట్టలేదు. ఇక, పార్టీ సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో శ్రేణులకు మార్గనిర్దేశం చేయాల్సిన అధినేత ఇంటి బయటకే రావడం లేదు.
కవిత వ్యవహారం, అంతర్గత కల్లోలంపై కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. ఇక, ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, బయటా పోరాడాల్సిన ప్రతిపక్ష నేత కనీసం ఆ బాధ్యత కూడా నెరవేర్చడం లేదు. కేటీఆర్, హరీశ్‌రావులపైకి బాధ్యతలు నెట్టేసి ఫామ్ హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.