అక్షరటుడే, గాంధారి : Kamareddy Axe Attack | మామా అల్లుళ్ల వరుస అయ్యే ఇద్దరు దుండగులు మద్యం మత్తులో బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. తరచూ కత్తిపోట్ల ఘటనలతో వార్తల్లో నిలిచే కామారెడ్డి.. తాజాగా గొడ్డలి దాడితో మరోమారు వార్తల్లో నిలిచింది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో శుక్రవారం (డిసెంబరు 26) అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రంజిత్ అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన నర్సింలు ఇంటికి వెళ్ళాడు. అక్కడ నర్సింలు అల్లుడు బాలయ్య కూడా ఉన్నాడు.
Kamareddy Axe Attack | మాట మాట పెరిగి
రంజిత్, నర్సింలు, బాలయ్య ముగ్గురు మద్యం తాగారు. ఈ క్రమంలో మాట పట్టింపు విషయంలో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మా ఇంటికే వచ్చి గొడవ చేస్తావా అంటూ నర్సింలు, బాలయ్య ఇద్దరు కలిసి.. రంజిత్‌పై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో రంజిత్ ఎడమ చెవి పక్కన మెడపై తీవ్ర గాయమైంది.
స్థానికులు వెంటనే రంజిత్‌ను చికిత్స నిమిత్తం బాన్సువాడకు, అక్కడి నుంచి నిజామాబాద్ కు తరలించారు. ముగ్గురి మధ్య మాట మాట పెరిగి దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడికి గురైన బాధిత యువకుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడం, దాడి చేసిన వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావడంతో ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇది కచ్చితంగా రాజకీయ దాడేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.