అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Avatar: Fire and Ash Review | అవతార్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు అరుదు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ వెండితెరపై సృష్టించిన అద్భుత ప్రపంచమే ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు.. భారతదేశంలోనూ ‘అవతార్’ సిరీస్‌కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది.
అంతేకాదు, విడుదలైన ప్రతి భాగం స్టార్ హీరోల సినిమాలను మించిపోయే స్థాయిలో వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగంగా ‘Avatar: Fire and Ash’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్‌తో పాటు జాన్ లండావు (Producer John Landau) నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ (Hollywood director James Cameron) సృష్టించిన అద్భుత ఫాంటసీ ప్రపంచం ‘అవతార్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2009లో సంచలనం సృష్టించిన ‘అవతార్’, 2022లో వచ్చిన ‘ది వే ఆఫ్ వాటర్’ తర్వాత మూడో భాగంగా ‘Avatar: Fire and Ash’ తెరకెక్కింది. ఈసారి సముద్రాల నుంచి మంటల లోకానికి ప్రేక్షకులను తీసుకెళ్లిన కామెరాన్… నిజంగా మ్యాజిక్ రిపీట్ చేసాడా? అన్నదే అసలు ప్రశ్న.
కథ :
‘అవతార్ 3’ కథ పూర్తిగా మొదటి రెండు భాగాలకు కొనసాగింపే. పండోరా గ్రహంలోని ప్రకృతి సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో మనుషులు మళ్లీ దాడులకు దిగుతారు. నావీ తెగతో కలిసిపోయిన జేక్ సల్లీ, అతని భార్య నేత్రిని, వారి పిల్లలు పండోరాను కాపాడేందుకు మరోసారి యుద్ధానికి సిద్ధమవుతారు.
రెండో భాగంలో సముద్రాల లోతుల్లో జీవించే తెగలను చూపించిన జేమ్స్ కామెరాన్… ఈసారి అగ్నికి అతి సమీపంగా జీవించే ‘ఫైర్ క్లాన్’ (అగ్ని తెగ)ను పరిచయం చేశాడు. ఈ తెగతో కలిసి జేక్ సల్లీ మనుషులపై చేసే పోరాటమే ‘Avatar: Fire and Ash’. ఈ భాగంలో కొత్తగా విలన్‌గా ఊనా చాప్లిన్ పోషించిన వరాంగ్ పాత్ర కథకు కొంత ఆసక్తిని జోడిస్తుంది.
హైలైట్స్ :
జేమ్స్ కామెరాన్ మార్క్ విజువల్స్, VFX అద్భుతం
IMAX, 3D స్క్రీన్లపై చూసేవారికి విజువల్ ఫీస్ట్
అగ్ని తెగ డిజైన్, వారి జీవన విధానం ఆకట్టుకుంటాయి
ఊనా చాప్లిన్ చేసిన వరాంగ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ
కుటుంబ భావోద్వేగాలు, మాతృత్వం, ప్రకృతి పరిరక్షణ సందేశం బలంగా ఉంటుంది.
నటీనటులు : సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్లెట్, ఊనా చాప్లిన్
దర్శకుడు : జేమ్స్ కామెరూన్
నిర్మాతలు : జేమ్స్ కామెరూన్, జాన్ లండావు
సినిమాటోగ్రఫీ : రస్సెల్ కార్పెంటర్
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్
ఎడిటింగ్ : స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరూన్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం
రన్‌టైమ్ చాలా ఎక్కువగా ఉండటం
ముందే ఊహించగలిగే సన్నివేశాలు
థ్రిల్లింగ్ సర్ప్రైజ్ మూమెంట్స్ లేకపోవడం
సాంకేతిక అంశాలు :
ఈ సినిమాకు ప్రాణం VFX, సినిమాటోగ్రఫీనే. పండోరా ప్రపంచాన్ని మరోసారి అద్భుతంగా ఆవిష్కరించాడు కామెరాన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరైన బలాన్ని ఇచ్చింది. కానీ కథకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేలో కొంత కత్తెర పడితే మరింత బాగుండేదనే ఫీల్ కలుగుతుంది. పండోర గ్రహం విజువల్స్ (Pandora Planet Visuals), యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటాయి. అయితే కథలో ఎమోషనల్ డెప్త్ లేదు. కేవలం విజువల్స్ మాత్రమే హై లైట్ చేస్తూ కథ ఏమీ లేకుండా జేమ్స్ కామెరూన్ చీటింగ్ చేయడం కొంత బాధిస్తుంది.
విశ్లేషణ:
సినిమా కథలో పెద్దగా కొత్తదనం కనిపించదు. పండోరాను కాపాడటం, మనుషుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం, కుటుంబం, ప్రకృతి ప్రేమ వంటి అంశాలే మళ్లీ కేంద్రంగా నిలుస్తాయి. మొదటి భాగంలో అడవులు, రెండో భాగంలో సముద్రాలు… ఇప్పుడు మూడో భాగంలో మంటలు మాత్రమే కొత్తగా మారాయి. దాదాపు 3 గంటల 17 నిమిషాల రన్టైమ్తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే పరంగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ, కథ నెమ్మదిగా సాగడం వల్ల కొన్ని చోట్ల బోర్ కొట్టే అవకాశం ఉంది. అయినప్పటికి ‘Avatar: Fire and Ash’ అవతార్ అభిమానులకు మాత్రం ఇది తప్పక చూడదగిన సినిమా.
రేటింగ్ : 3 / 5