అక్షరటుడే, హైదరాబాద్: child marriage : బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Telangana capital Hyderabad) కు కూత వేటు దూరంలో దారుణానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు.
ఓ 40 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల బాలిక మెడలో తాళి కట్టేశాడు. దీనికి పంతులు కూడా హాజరయ్యాడు. రెండు నెలల తర్వాత టీచర్ల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా(Rangareddy district) నందిగామలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివాహ ముహూర్తం నిశ్చయించుకుని, పెళ్లికి మండపం సిద్ధం చేసుకున్నాడు. పురోహితుడిని పిలిపించుకున్నాడు. తాళి కట్టి ఇంటికి తీసుకెళ్లాడు. రెండు నెలలు ఆ బాలికతోనే ఉన్నాడు.
ఈ విషయాన్ని పాఠశాల టీచర్ల ద్వారా తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాలిక తల్లి, 40 ఏళ్ల పెళ్లికొడుకు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడితోపాటు మధ్యవర్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీడీఎస్ (ICDS) అధికారుల సహకారంతో బాలికను సఖీ కేంద్రాని(Sakhi Kendra)కి తరలించారు.
child marriage : అసలేం జరిగిందంటే..
నందిగామ(Nandigama)కు చెందిన మహిళకు భర్త చనిపోయాడు. ఆమెకు కొడుకు, కూతురు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. ఆమె కూతురు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
కాగా, పిల్లల పోషణ భారంగా భావించిన తల్లి.. కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యవర్తిని సంప్రదించింది. అతను ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్. అతడికి బాగా ఆస్తి ఉందని నమ్మించి ఒప్పించాడు మధ్యవర్తి.
అలా గత మే 28న బాలిక మెడలో శ్రీనివాస్ తాళి కట్టాడు. కాగా, సదరు మైనర్‌కు ఈ వివాహం ఇష్టం లేదు. తాను చదువుకుంటానని తల్లికి చెప్పింది. కానీ, ఆస్తిపరుడు అని చెప్పి ఆమె తల్లి బలవంతంగా వివాహం జరిపించింది.
ఈ విషయాన్ని ఇటీవల బాలిక తన స్కూల్ టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. సదరు టీచర్లు తహసీల్దార్ దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
”బాలిక(GIRL)తో 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ సుమారు రెండు నెలలపాటు కలిసి ఉన్నాడు. మైనర్‌తో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయితే అతడిపై పొక్సో(POCSO) కేసు నమోదు చేస్తాం.. ” అని పోలీసులు స్పష్టం చేశారు.