అక్షరటుడే, వెబ్‌డెస్క్: He trapped woman : ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.. మరొకామెతో అప్పటికే వివాహం అయింది. వీరిద్దరు సరిపోలేదన్నట్లు ఇంకొక అమాయకురాలిని ట్రాప్ చేశాడు.. మోజు తీరాక.. సినీ ఫక్కీలో అంతమొందించాడు. సస్పెన్స్, క్రైమ్, త్రిల్లర్ కథను తలపించే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలి దాకమర్రి లేఔట్ లో వెలుగు చూసింది.
భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో విజయనగరం రోడ్డుకి ఆనుకొని ఉన్న ఓ లేఅవుట్లో.. ఈ నెల(మే) 2న సగం కాలిన మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో పోలీసులకు కేసు ఛేదన సవాలుగా మారింది.
సగం కాలిన శవంపై ఉన్న వస్త్రాలు, ఇతర ఆధారాల ఆధారంగా మధురవాడ మాలిక వలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు. అంతకు ముందు రోజు ఒక వ్యక్తితో వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి నిందితుడు క్రాంతి కుమార్ ను అదుపులోకి తీసుకోవడంతో అతడి బాగోతం మొత్తం బయటపడింది.
విజయనగరం జిల్లా డెంకాడ కు చెందిన వెంకటలక్ష్మి ఇద్దరు కొడుకులతో కలిసి మధురవాడ మాలిక వలసలోని రాజీవ్ గృహాల లో నివాసం ఉంటోంది. ఆమె పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు.
ఇక ఒడిస్సాలోని రాయగడ జిల్లా కాంపోమల్లిగాం కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తి తనకు మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య, పిల్లలు తగరపువలసలో నివాసం ఉంచాడు. రెండో భార్యను నాలుగేళ్ల క్రితం రాజీవ్ గృహకల్పలోని ఓ ఇంట్లో నివాసం ఏర్పాటు చేశాడు.
కాగా, క్రాంతి కుమార్ రెండో భార్య ఇంటి పక్కనే వెంకటలక్ష్మి ఉండేది. ఈ క్రమంలో వెంకటలక్ష్మి, క్రాంతి కుమార్ మధ్య పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది.
వెంకటలక్ష్మి వ్యవహారం క్రాంతికుమార్ ఇద్దరు భార్యలకు తెలియడంతో అతడితో గొడవకు దిగారు. మరోవైపు వెంకటలక్ష్మీ సైతం అతడిపై ఒత్తిడి చేసింది. తన భార్యలకు మాదిరే మరొక ఇంట్లో ఉంచి, నెలనెలా ఖర్చులకు డబ్బలు ఇవ్వాలని పట్టుబట్టింది. దీంతో వెంకటలక్ష్మిని వదిలించుకోవాలని క్రాంతి కుమార్ ప్లాన్ వేశాడు.
ఈ నెల ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు షికారుకు వెళ్దామని వెంకటలక్ష్మిని క్రాంతికుమార్ బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరు బైక్ పై బయలుదేరారు. కైలాసగిరి ప్రాంతంలోని బీచ్ కు ఆనుకొని ఉన్న తేన్నేటి పార్కుకు వెళ్లారు. అక్కడ ఆమెకు ఐస్ క్రీమ్ తినిపించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి పెట్రోల్ బంకుకు చేరుకున్నాడు. వెంకటలక్ష్మీ ముందరే క్రాంతికుమార్ కొంత పెట్రోల్ బైక్‌లో వేయించి, మరికొంత వెంట తెచ్చుకున్న బాటిల్ లో పట్టించాడు. అలా ఎందుకని ఆమె అడిగితే.. ఇంటి దగ్గర బైక్ పెడితే పెట్రోల్ దొంగిలిస్తున్నారని, ఉదయాన్నే పనికి వెళ్లే సమయంలో ఇబ్బంది పడే బదులు ముందే దాచి పెట్టుకుంటే బెటర్ అని నమ్మించాడు. తర్వాత అక్కడి నుంచి తిమ్మాపురం వైపు వెళ్లారు. అక్కడ రామాద్రిపురం బీచ్ వద్దకు చేరుకుని, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ నూడుల్స్ తిన్నారు. అక్కడ నుంచి బయలుదేరి రఘు కాలేజ్ రోడ్డులోని టీ టైమ్ దగ్గర కాసేపు ఆగారు. అక్కడ ఇద్దరూ కాఫీ తాగారు.
తర్వాత అర్ధరాత్రి సమయంలో కాసేపు ఎంజాయ్ చేద్దామంటూ ఫార్చ్యూన్ లేఅవుట్ లోనికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక చీకట్లో ఆమె చనువుగా ఉన్న సమయంలో.. వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటలక్ష్మి గొంతు కోసి, దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆమె మెడలోని ఆభరణాలు, చెవి దిద్దులు తీసుకున్నాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను వెంకటలక్ష్మి ముఖంపై పోసి, నిప్పంటించి పారిపోయాడు. కానీ, సగం కాలిన మృతదేహంపై లభ్యమైన ఆధారాలు, కాల్ డేటాతో చివరికి నిందితుడు పట్టుబడి, జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.