అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jukkal | వేసవి కాలంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ వారి పట్ల మృత్యుపాశం అయింది. ఎయిర్ కూలర్‌కు విద్యుత్ షాక్ (air cooler electric shock) రావడంతో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన జుక్కల్ మండలం పెద్దగుల్ల తండాలో (jukkal mandal, peddagulla thanda) శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకబాయి(34), ఆమె కూతురు శివాని(14) రాత్రి కూలర్ ఆన్ చేసి నిద్రించారు. కూలర్లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయింది. శివాణి కాలు రాత్రి కూలర్ నీటితొట్టెలో పడింది. దీంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్ కొట్టడంతో ఆమె మృతి చెందింది. శంకబాయి కొడుకు ప్రతీక్ బయట పడుకోవడంతో తప్పించుకున్నాడు. ఉదయం లేచి చూసిన ప్రతీక్ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
