అక్షరటుడే, న్యూఢిల్లీ: Airports closed : భారత్ – పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతలు మరింతగా పెరిగిన నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్‌లోని పలు విమానాశ్రయాలను మే15 వరకు మూసివేస్తున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే శ్రీనగర్, చండీగఢ్ సహా మొత్తం 24 ఎయిర్‌పోర్టుల్లో పౌర విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మొదట మే 10 వరకు రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజాగా మరో ఐదు రోజులు దానిని పొడిగించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టులకు రాకపోకలను నిలిపివేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. కాగా, జమ్మూ, చండీగఢ్‌లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేకంగా 4 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Airports closed : ప్రస్తుతం మూసివేసిన ఎయిర్‌పోర్టులు ఇవే..
శ్రీనగర్, జమ్మూ, లుథియానా, అమృత్సర్, చండీగఢ్, భుంటార్, పటియాలా, కిషన్‌గఢ్, శిమ్లా, ధర్మశాల, జైసల్మేర్, జోధ్‌పుర్, భఠిండా, లేహ్, బికానేర్, జామ్‌నగర్, పఠాన్‌కోట్, రాజ్‌కోట్, భుజ్ తదితర విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు తమ ప్రయాణ తేదీలను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఇండిగో (Air India , IndiGo) ప్రకటించాయి. రద్దు చేసుకుంటే, పూర్తి రీఫండ్ చెల్లిస్తామని పేర్కొన్నాయి.