Operation Sindoor | పహల్​గామ్​​ ఉగ్రదాడికి ప్రతీకారం.. పాక్​లోకి చొచ్చుకెళ్లి దాడులు
Operation Sindoor | పహల్​గామ్​​ ఉగ్రదాడికి ప్రతీకారం.. పాక్​లోకి చొచ్చుకెళ్లి దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడికి భార‌త్ బ‌దులు తీర్చుకుంది. పాకిస్తాన్‌లోకి చొచ్చుకెళ్లి మ‌రీ మెరుపు దాడులు చేసింది. 26 మంది అమాయ‌క పౌరులకు నివాళులర్పిస్తూ.. భార‌త‌మాత‌కు సింధూరంతో తిల‌కం దిద్దింది. వంద మందికి పైగా ఉగ్ర‌వాదుల‌ను ఊచ‌కోత కోసింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి పాకిస్తాన్‌పై భీక‌ర దాడులు చేసిన భ‌ద్ర‌తాద‌ళాలు.. ప్ర‌ధానంగా ఉగ్ర‌వాద కేంద్రాల‌ను మ‌ట్టుబెట్టాయి. ప‌హల్​గామ్​ దాడికి బదులు తీర్చుకుంటామని చెప్పిన‌ట్లుగా భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్‌లో అల‌జ‌డి రేపింది.

ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు విరుచుకుప‌డ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాక్‌లోని పలు ఉగ్రవాద శిబిరాలను నేల‌మ‌ట్టంచేశాయి. లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్‌బుల్ ముజాహిద్దీన్, ఇతర ఉగ్రసంస్థల స్థావరాలు, టెర్రర్ నెట్‌వ‌ర్క్‌ల‌ను ధ్వంసం చేసింది. బహావల్‌పూర్, మురిద్కే, కోట్లీ, గుల్‌పూర్, సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా ప్రాంతాల్లో ఈ దాడులు జ‌రిగాయి.

ప‌హల్​గామ్​లో 26 మంది అమాయ‌కుల ఊచకోతకు ప్రతీకారంగా భార‌త్ చేసిన దాడుల్లో వంద‌లాది మంది ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించిన‌ట్లు తెలిసింది. ఒక్క పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో జరిపిన దాడుల్లో 100 మందికి పైగా జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం బుధవారం తెల్లవారుజామున క్షిపణి దాడులు నిర్వహించింది, ఇండియా టార్గెట్ చేసిన తొమ్మిది స్థావరాల్లో బహల్పూర్‌లో జెఎం ప్రధాన కార్యాలయం, పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని మురిద్కేలో లష్కరే తోయిబా క్యాంపు కార్యాలయం ఉన్నాయి.

‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా తెల్లవారుజామున 1:44 గంటలకు సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. “కొద్దిసేపటి క్రితం, భారత సాయుధ దళాలు పాకిస్తాన్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించాయి, అక్కడి నుంచి భారత్‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న ఉగ్రవాద దాడుల‌ను నియంత్రించాయ‌ని” అని భారత రక్షణ శాఖ ప్రకటన పేర్కొంది. ఎక్క‌డా కూడా పాకిస్తాన్ సైనిక వ‌స‌తుల‌ను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాల ఎంపిక అమలు పద్ధతిలో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింద‌ని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్‌లో ఉగ్ర‌వాద స్థావరాల‌ను నేల‌మ‌ట్టం చేసిన అనంత‌రం ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భార‌త్‌మాతాకి జై అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మ‌రోవైపు, ‘న్యాయం జ‌రిగింది’ అని భార‌త ఆర్మీ తెలిపింది.

భార‌త్ దాడుల్లో ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు గట్టి దెబ్బ తగింది. వంద మందికి పైగా ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. బహావల్‌పూర్‌లో జైషేఏ మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ ఉంది. మురిద్కే లో లష్కరే తోయిబా శిక్షణ‌ క్యాంపు ఉంది. కోట్లీలో సూసైడ్ బాంబర్ల శిక్షణ కార్యక్రమాలు సాగుతుంటాయి. గుల్‌పూర్‌లో నుంచి ఉగ్రవాదులు తరచూ పూంచ్, రాజౌలీలపై దాడులకు దిగుతుంటారు. సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్‌మూనా వంటి ప్రాంతాలు ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వాటినే టార్గెట్‌గా చేసుకుని భార‌త్ దాడి చేసింది.