Gautam Gambhir |భారత క్రికెట్ వారి జాగీరు కాదు: గౌతమ్ గంభీర్

Gautam Gambhir |భారత క్రికెట్ వారి జాగీరు కాదు: గౌతమ్ గంభీర్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భారత క్రికెట్ ఎవరి సొంత జాగీరు కాదని, 140 కోట్ల భారత ప్రజలదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. కొందరు మాజీ క్రికెటర్లు కామెంట్రీ ప్యానెల్‌లో కూర్చొని టీమిండియాను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏబీపీ ఇండియా 2047 సమ్మిట్‌లో పాల్గొన్న గంభీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

టీమిండియా హెడ్ కోచ్‌గా తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని, దేశం గర్వపడేలా జట్టును తయారు చేయడమే తన లక్ష్యమని గంభీర్ స్పష్టం చేశాడు. ‘నాపై వచ్చే విమర్శలను నేను పట్టించుకోను. అత్యుత్తమ జట్టు సిద్దం చేయడమే కోచ్‌గా నా లక్ష్యం. నేను కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 8 నెలలు మాత్రమే అవుతుంది. జట్టు పరంగా విమర్శలు తీసుకోవడానికి నేను సిద్దం. కామెంటేటర్లు పని కూడా అదే. కానీ కొందరు 25 ఏళ్లుగా కామెంట్రీ బాక్స్‌లో కూర్చుంటూ.. నేను చేసే ప్రతీ పనిని నిలదీస్తున్నారు. వారు టీమిండియాను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భారత క్రికెట్ ఎవరి సొంత జాగీరు కాదు.140 కోట్ల భారత ప్రజలది. వారు నా కోచింగ్, రికార్డ్స్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ విషయంలోనూ విమర్శలు చేశారు.

ఈ దేశంలో డబ్బులు సంపాదిస్తూ.. పన్నులు ఎగవేయడానికి ఎన్ఆర్‌ఐలుగా అవతారమెత్తే వారు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను భారతీయుడిని, నా చివరి శ్వాస వరకు ఈ దేశ పౌరుడిగానే ఉంటాను. పన్ను ఆదా చేయడానికి ఎన్‌ఆర్‌ఐగా అవతారమెత్తను.’అని పేర్లు ప్రస్తావించకుండా మాజీ క్రికెటర్లకు గౌతమ్ గంభీర్ చురకలంటించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులో కొనసాగుతారని, లేకుంటే సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు.