అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mysore city : మైసూర్ శివారు వరుణ గ్రామంలోని ఓ హోటల్ ఎదుట ఐదుగురు కలిసి ఒక యువకుడిని దారుణంగా హతమార్చారు. హత్యకు గురైన యువకుడిని మైసూరు నగరంలోని క్యాతమారనహళ్లి నివాసి కార్తీక్(33)గా పోలీసులు గుర్తించారు.
కార్తీక్ ను అతడి స్నేహితుడు ప్రవీణ్.. కొంతమందితో కలిసి హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం కొంత కాలం క్రితం ప్రవీణ్, కార్తీక్ మధ్య గొడవ జరగడమే. ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై వివాదం ఉంది. గొడవ సమయంలో ప్రవీణ్‌ను చంపేస్తానని కార్తీక్ బెదిరించాడని, ఈ క్రమంలో తనను ఎక్కడ చంపేస్తాడనే భయంతో ప్రవీణే కార్తీక్‌ను హతమార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కార్తీక్ రౌడీ షీటర్. చిక్కహళ్లిలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో కార్తీక్ జైలుకెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాగా, కార్తీక్ హత్యలో ఓ మహిళ హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. కార్తీక్‌కి ఆదివారం రాత్రి మహిళ ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచిందని.. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యాడని మృతుని తల్లి వెల్లడించారు.
కాగా, కార్తీక్‌ను హత్య చేసిన అనంతరం అతని మృతదేహంపై ప్రవీణ్ నిల్చొని డ్యాన్స్ చేస్తూ వికృతంగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం అంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.