Data Usages | ప్ర‌తినెలా స‌గ‌టున 27 జీబీలు.. పెరుగుతున్న డేటా వినియోగం
Data Usages | ప్ర‌తినెలా స‌గ‌టున 27 జీబీలు.. పెరుగుతున్న డేటా వినియోగం

అక్షరటుడే, వెబ్​డెస్క్:Data Usages | భారతదేశంలో డేటా వినియోగం వేగంగా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ల(Smartphones) రాక‌తో పాటు టెలికాం సేవ‌లు మెరుగుప‌డ‌డంతో ప్ర‌తి మ‌నిషికి ఇంట‌ర్నెట్(Internet) అందుబాటులోకి వ‌చ్చింది. దీనికి తోడు 5జీ సేవ‌లు కూడా రావ‌డంతో అప‌రిమితంగా డేటా వాడుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో దేశంలో సగటు నెలవారీ డేటా వినియోగం 27.5GBకి చేరుకుంది. ఇది ఇంటర్నెట్ వినియోగ ధోరణులలో గణనీయమైన పెరుగుదలకు నిద‌ర్శ‌నంగా నిలిచింది.

Data Usages | భారీగా పెరుగుదల‌..

స్మార్ట్‌ఫోన్ల రాక‌తో ఎక్కువ మంది ప్ర‌జ‌లు ఇంట‌ర్నెట్‌కు ఆక‌ర్షితుల‌య్యారు. ఈ నేప‌థ్యంలో మొబైల్ డేటా(Mobile Data) వినియోగం భారీగా పెరిగింది. గత ఐదు సంవత్సరాలలో భారతదేశ డేటా వినియోగం 19.5 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో పెరుగుతోందని ఇటీవల ఓ నివేదిక వెల్ల‌డించింది. 5G టెక్నాలజీతో పాటు నాణ్య‌మైన వైర్‌లెస్ సేవలు(Wireless Services) అందుబాటులోకి రావ‌డం మూలంగా డేటా వినియోగం భారీగా పెరిగింది.

Data Usages | 5G రాక‌తో..

నోకియా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ (MBiT) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా నెలవారీ 5G డేటా ట్రాఫిక్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2026 మొదటి త్రైమాసికం నాటికి 5G డేటా వినియోగం 4G వినియోగాన్ని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 5G వినియోగంలో అత్యధిక పెరుగుదల B, C కేటగిరీ సర్కిల్‌లలో న‌మోదువుతోంది. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం వరుసగా 3.4 రెట్లు, 3.2 రెట్లు పెరిగింది.

Data Usages | కనెక్టివిటీపై ఆసక్తి..

మెట్రో నగరాల్లో(Metro Cities) 5G కనెక్టివిటీని ప్రవేశపెట్టడం మూలంగా అపరిమిత డేటా అందుబాటులోకి రావ‌డంతో వినియోగం పెరిగింది. 2023లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్(Mobile broadband) వినియోగంలో 5జీ సేవ‌లు కేవలం 20 శాతం ఉంటే, ఇప్పుడు 43 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. మ‌రోవైపు, 4G డేటా వినియోగం తగ్గుతుండ‌డం, 5G నెట్‌వర్క్‌(Net Work)ల వైపు మ‌ళ్లుతుండ‌డం గ‌మ‌నార్హం. 5G రాక‌తో 5G స్మార్ట్‌ఫోన్‌లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. భారతదేశంలో యాక్టివ్ 5G పరికరాల సంఖ్య 2024లో 27.1 కోట్లు (271 మిలియన్లు) దాటింది. ఈ ట్రెండ్ మరింత వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. 2025 చివరి నాటికి దేశంలో దాదాపు 90 శాతం 5G స్మార్ట్‌ఫోన్లనే(Smart Phones) వినియోగిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.