అక్షరటుడే, న్యూఢిల్లీ: Baglihar Dam : పహల్గావ్ ఉగ్రదాడి Pahalgaon terror attack తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే కృత నిశ్చయంతో ఉన్న ఇండియా.. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌పై ముప్పేట దాడి చేస్తోంది. పొరుగుదేశాన్ని భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది.
ఇప్పటికే ఆ దేశ పౌరుల వీసాలు రద్దు చేసి పాకిస్తానీలను వెనక్కి పంపించింది. దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యానికి కేంద్ర బిందువుగా ఉన్న అటారి సరిహద్దు మూసివేసింది. పాక్ సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించింది. వ్యాపార ఆంక్షలు విధించడంతో పాటు దౌత్యపరంగా ప్రపంచ దేశాలు మద్దతు కూడగట్టి పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పాక్‌తో కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్న భారత్… తాజాగా మరో జల యుద్ధం చేపట్టింది. పాకిస్తాన్లో వ్యవసాయరంగానికి మూలాధారమైన నదీజలాల ప్రవాహాలను భారత్ నుంచి పొరుగు దేశం వెళ్లకుండా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి ప్రవాహాన్ని కట్టడి చేసింది.
2008లో చినాబ్ నదిపై 900 మెగావాట్ల జలవిద్యుత్తు hydroelectric power ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యామ్‌ను నిర్మించారు. ఈ ఆనకట్ట పొడవు దాదాపు 145 మీటర్లు. సింధూ జలాల ఒప్పందం మేరకు పాక్‌కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ ఒకటి. ఈ నదీ జలాల ఆధారంగానే దాయాది దేశంలోని పంజాబ్ పరిసర ప్రాంతాల్లో పంటలు పండిస్తున్నారు.
మరోవైపు జీలమ్ నదీ Jhelum River జలాల విషయంలోనూ భారత్ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నదిపై ఉన్న కిషన్ గంగా డ్యామ్ Kishan Ganga Dam ద్వారా నీటి విడుదలను నిలిపివేసేందుకు చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది.