GT vs SRH | అందుకే అంపైర్‌తో గొడవపడ్డా: శుభ్‌మన్ గిల్
GT vs SRH | అందుకే అంపైర్‌తో గొడవపడ్డా: శుభ్‌మన్ గిల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GT vs SRH | భావోద్వేగాలను అదుపు చేసుకోలేకనే అంపైర్లతో వాగ్వాదానికి దిగానని గుజరాత్ టైటాన్స్ GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Shubman Gill తెలిపాడు. విజయం కోసం 110 శాతం కృషి చేస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటివి జరుగుతుంటాయన్నాడు. ఈ విషయంలో తాను ఏ మాత్రం తగ్గనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ IPL 2025 సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ SRHతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సార్లు సహనం కోల్పోయాడు. ముందుగా తన రనౌట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గిల్.. అనంతరం అభిషేక్ శర్మ ఎల్బీ రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.

మ్యాచ్ అనంతరం ఈ ఘటనలపై హోస్ట్ ప్రశ్నించగా.. గిల్ Gill ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు, అంపైర్ మధ్య వాగ్వాదం జరిగింది. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. గెలుపు కోసం 100 శాతం కృషి చేస్తున్నప్పుడు సహజంగానే ఇలాంటివి జరుగుతుంటాయి. నేను నా వైఖరి నుంచి వెనక్కి తగ్గను. అక్కడ నా ఉద్దేశం ఏంటో అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేశాను. సన్‌రైజర్స్‌పై SRH గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉంది. తదుపరి మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రద్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం.’అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

అంపైర్లతో వాగ్వాదానికి దిగిన శుభ్‌మన్ గిల్‌‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. అతనికి మ్యాచ్ ఫీజులో 50 నుంచి 100 శాతం కోత పడనుంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరో విజయం సాధిస్తే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది.