- Advertisement -
HomeతెలంగాణKTR | ఏ తప్పూ చేయలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

KTR | ఏ తప్పూ చేయలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : KTR | మెట్రో నుంచి ఎల్‌ అండ్‌ టీ నిష్క్రమణ తెలంగాణ ప్రభుత్వానికి మాయని మచ్చ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరు వల్లే ఎల్ అండ్ టీ సంస్థ (L&T company)  వెళ్లిపోయిందని విమర్శించారు.

- Advertisement -

ప్రజా సమస్యలు ఆర్‌ ఎస్‌ (రేవంత్‌ రెడ్డి, సంజయ్‌) బ్రదర్స్‌ కు పట్టవని, తాను ఏ కారులో తిరుగుతున్నాననేదే వారికి ముఖ్యమన్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. తెలంగాణ భవన్​ (Telangana Bhavan) లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

కేటీఆర్‌ అరెస్టు కావడం ఖాయమని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ (PCC chief Mahesh Kumar) చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు.

తన అరెస్టుపై కాంగ్రెస్‌ నేతలు కలలు కంటున్నారని, కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా కేటీఆర్​ చేశారు.

తాను తప్పు చేయలేదని అరెస్టు చేసుకుంటే చేసుకోవాలన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. తన అరెస్టుతో సీఎం రేవంత్​ రెడ్డికి పైశాచిక ఆనందం తప్ప మరొకటి రాదని ఆక్షేపించారు.

KTR | లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా?

తాను ఏ తప్పు చేయలేదని, దీనిని నిరూపించుకునేందుకు లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని కేటీఆర్‌ (KTR) ప్రకటించారు. తనతో పాటు రేవంత్​ రెడ్డి కూడా లై డిటెక్టర్ టెస్ట్​కు రావాలన్నారు.

తనతో పాటు రేవంత్ రెడ్డి మీద కూడా ఏసీబీ కేసులు (ACB cases) ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇద్దరం కలిసి లై డిటెక్టర్‌ పరీక్షకు వెళ్దామని సవాల్‌ విసిరారు.

కార్ల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆర్ఎస్(రేవంత్, సంజయ్) బ్రదర్స్ కు ప్రజా సమస్యలు పట్టవని, తాను ఏ కారులో తిరుగుతున్నానో మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు. కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

KTR | సీఎం వల్లే ఎల్ అండ్ టీ వెనక్కి..

సీఎం రేవంత్ రెడ్డి అహంకారం, నియంతృత్వ పోకడలతో ఎల్ అండ్ టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. అందుకే మెట్రో నుంచి వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) నిర్వహణ విషయంలో ఆ సంస్థకు 2070 వరకు లీజు ఒప్పందం ఉందని, అయినా మధ్యలోనే ఎందుకు వెళ్లిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ నుంచి ఆ సంస్థ వెళ్లిపోయిందంటే అది తెలంగాణ రాష్ట్రానికి మాయని మచ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు.

మెట్రోను తీసుకోవడం ప్రభుత్వ అనాలోచిత చర్య అని మండిపడ్డారు. 2008లో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు మెట్రో పనులకు టెండర్లు పిలిస్తే ముందు మేటాస్‌ వచ్చిందని, ఆ సంస్థ తర్వాత వెనక్కు వెళ్లడంతో ఎల్‌ అండ్‌ టీ టెండర్‌ ఫైనల్‌ అయిందని వివరించారు.

తాము 2014లో అధికారంలోకి వచ్చే సమయానికి 25 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయని గుర్తు చేసిన కేటీఆర్.. వేగంగా మెట్రోను పూర్తి చేసి, 2017లో ప్రారంభించామన్నారు. కొవిడ్‌ తర్వాత ప్రజా రవాణా స్తంభించిపోతే ప్రభుత్వం తరఫున అండగా నిలిచామన్నారు.

తాము దిగిపోయే నాటికి దేశంలో రెండో అతిపెద్ద నెట్‌ వర్క్‌ గా ఉన్న హైదరాబాద్‌ మెట్రో.. ఇవాళ తొమ్మిదో స్థానానికి పడిపోయిందంటే దానికి కారణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మండిపడ్డారు.

రేవంత్‌ తీరు వల్ల ఇవాళ ఎల్‌ అండ్‌ టీ పూర్తిగా మెట్రో నుంచి తప్పుకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి రాగానే ఎయిర్ పోర్టు మెట్రోను అనాలోచితంగా రద్దు చేశారని, లేకపోతే ఈ పాటికే పూర్తయ్యేదని తెలిపారు.

కేటీఆర్ భూములు ఉన్నాయట అని పిచ్చి ఆలోచనలతో ఎల్ అండ్ టీని దెబ్బకొట్టారని, అక్కడ్నుంచి రేవంత్ రెడ్డికి ఎల్ అండ్ టీకి పంచాయితీ మొదలైందన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News