అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Rains | హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదలడం లేదు. ఎడతెరిపి లేకుండా గురువారం నుంచి కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలో గురువారం ఉదయం ప్రారంభమైన వర్షం ఇంకా పడుతూనే ఉంది. రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కొత్తపేట, చైతన్యపురి, హయత్నగర్, చందానగర్, శేరిలింగంపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad Rains | రోడ్లపై నిలిచిన నీరు
నగరంలో భారీ వర్షం(Heavy Rains)తో రోడ్లపై నీరు చేరింది. దీంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పటాన్చెరులో వర్షం పడటంతో హైదరాబాద్-ముంబై 65వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ దగ్గర వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయింది. గచ్చిబౌలి పరిధిలోని ఐఎస్బీ నుంచి మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ద్వారా విప్రో జంక్షన్ వరకు వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. చెరువు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad Rains | బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా..
నగరంలో వర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28న సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydraa Commissioner Ranganath) ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న మహిళలు, ప్రజలు వర్షంతో ఇబ్బందులు పడకూడదని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం(State Government) వాయిదా వేసిందని తెలిపారు. 28న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం ఇస్తారన్నారు.
Hyderabad Rains | సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో సైతం భారీ వర్షాలు కురిశాయి. పట్టణంలోని మార్కెట్ యార్డులోకి వరద నీరు చేరింది. దీంతో కూరగాయాల దుకాణాలు నీట మునిగి వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో సంగారెడ్డి నుంచి ముత్తంగి వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇస్నాపూర్ రుద్రారం వద్ద జాతీయ రహదారిపై నీరు నిలిచింది.
Hyderabad Rains | వర్షాలపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. భారీగా నీరు చేరే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకునేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
#Hyderabad #Secunderabad | Continuous rains have been lashing several parts of the city since early morning. 🌧️
According to the IMD, heavy showers are likely to continue today and tomorrow. Citizens are advised to stay safe and avoid unnecessary travel.#RainAlert #IMD… pic.twitter.com/nT1yFGWN30
— Voiceup Media (@VoiceUpMedia1) September 26, 2025