అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MNM Party | తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారేందుకు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ సీరియస్‌గా వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఉన్న ఎంఎన్‌ఎం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం డీఎంకేతో సీట్ల సర్ధుబాటు చేస్తుంది.
ఇప్పటికే పార్టీ కీలక నేతలతో నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించిన కమల్ హాసన్ (Kamal Haasan), నెక్ట్స్ ఎలెక్షన్‌కు దిశానిర్దేశం చేశారు. ఎంఎన్‌ఎం ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో మంచి ఓటింగ్ శాతం సాధించిన నియోజకవర్గాలను గుర్తించి, ఆ స్థానాలను తమకు కేటాయించేలా డీఎంకేపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉంది.
MNM Party | కమల్ వ్యూహాలు..
2021 శాసనసభ ఎన్నికల్లో పార్టీ 39 స్థానాల్లో పోటీచేసి, 9 శాతం ఓట్లను సాధించింది. 8 నియోజకవర్గాల్లో 10 శాతం మించి ఓట్లు రాబట్టగా, 71 నియోజకవర్గాల్లో 5 వేలకుపైగా ఓట్లు గెలుచుకుంది. కోయంబత్తూరులో స్వయంగా పోటీ చేసిన కమల్ హాసన్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతిచ్చిన ఎంఎన్‌ఎం (MNM Party), ముందస్తు ఒప్పందం ప్రకారం రాజ్యసభ స్థానాన్ని పొందింది. ఇప్పుడు ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 10కి పైగా సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను తీసుకొస్తోంది. పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా కమల్‌కు తెలిపారు.
నాయకుల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న కమల్ హాసన్, పార్టీకి తగినంత ప్రాతినిధ్యం లభించేలా డీఎంకేతో చర్చలు జరిపి, అవసరమైన సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. “ఇది పార్టీ బలాన్ని నిరూపించుకునే సమయం. మనం పోటీచేసే నియోజకవర్గాల్లో విజయం సాధించేలా కృషి చేయాలి,” అని ఆయన అన్నారు. తమిళనాడులో రాజకీయంగా పట్టు సాధించాలన్న కమల్ హాసన్ ఆశయానికి దోహదపడేలా ఎంఎన్‌ఎం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఓటు శాతం పెంచుకున్న పార్టీ, డీఎంకే కూటమిలో మరింత ప్రభావం చూపించేందుకు కసరత్తు ప్రారంభించింది.