అక్షరటుడే, న్యూఢిల్లీ: Trump Taxes On Pharma : యూఎస్ ప్రెసిడింట్ ట్రంప్ మరో పిడుగు వేశారు. అక్టోబరు 1వ తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని ఔషధాలపై 100 శాతం టారిఫ్ విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ నిర్ణయం భారత కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా, యూఎస్‌లో ఔషధాలు తయారు చేసే కంపెనీలకు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ విషయాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.
ఆది నుంచి అమెరికాలోనే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కంపెనీలను ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. టారిఫ్‌లు విధించడం ద్వారా దేశీయ కర్మాగారాల్లో పెట్టుబడులు పెంచేలా ఒత్తిడి తేవొచ్చనేది ట్రంప్ ఆలోచన.
కానీ, సుంకాలు పెంచితే.. ఆ భారం అంతిమంగా వినియోగదారులపై పడుతుందనే వాదనను ట్రంప్ ఒప్పుకోవడం లేదు.
Trump Taxes On Pharma | భారత ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం
భారత ఔషధ పరిశ్రమకు యూఎస్ ప్రధాన మార్కెట్‌గా ఉంది. మన దేశం నుంచి 40 శాతం ఔషధ ఎగుమతులు అమెరికాకే ఉంటున్నాయి.
ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న 100 శాతం టారిఫ్ నిర్ణయం వల్ల భారత ఫార్మాస్యూటికల్ (ఔషధ) పరిశ్రమపై మరింత ప్రభావం చూపనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఫార్మాస్యూటికల్ రంగంపై సుంకాలు విధిస్తే భారత ఫార్మా పరిశ్రమల ఆదాయంపై గణనీయమైన ప్రభావం ఉండే అవకాశం ఉందని గత ఆగస్టులో ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ఎందుకంటే టారిఫ్‌ల వల్ల భారత ఔషధ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.
Trump Taxes On Pharma | ఇతర ఉత్పత్తులపైనా వడ్డింపులు..
ఫార్మాపైనే కాకుండా ట్రంప్ గృహోపకరణ వస్తువులపైనా వడ్డింపులు ప్రకటించారు. బాత్రూం, కిచెన్ పరికరాలపై 50 శాతం, ఫర్నిచర్‌పై 30, పెద్ద ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.