అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Fixed Deposits Scam | అనుమతులు లేని కంపెనీల పేరుతో అమాయక ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి (Crime Branch ACP Nagendra Chari) పేర్కొన్నారు. సీసీఎస్ కార్యాలయంలో (CCS Office) బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2022లో శ్రేమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్ (32) ఓ సంస్థను కొంతమంది మిత్రులతో కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు.
అత్యధికంగా వడ్డీని ఇప్పిస్తామంటూ డిపాజిట్లను భారీమొత్తంలో స్వీకరించారు. వీరిచేతిలో మోసపోయిన ఇందల్వాయికి చెందిన ఉపాధ్యాయుడు హకీం ఇందల్వాయి పోలీసులకు (Indalwai Police) ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా 2022 నుంచి ఇప్పటివరకు సుమారు 125 మందిని చీట్ చేసి వారి వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించారు. దేశవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల వసూలు చేశారు.
దేశంలోని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో మీటింగ్‌లను ఏర్పాటు చేసి ప్రజలను మోసగించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రాంచ్‌లను కూడా నెలకొల్పారు. అమాయక ప్రజలను డిపాజిట్ (Fixed Deposits) పేరుతో చీటింగ్ చేసిన నగరానికి చెందిన మోయిజ్ ఖాన్, వాజిద్ హుస్సేన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీసీఎస్ ఏసీపీ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకెవరైనా వీరి బారిన పడి మోసపోయిన వారు సీపీకి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.