అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Smita Sabharwal | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికను కొట్టి వేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం పీసీ ఘోష్ (PC Gosh) కమిషన్‌ను వేసిన విషయం తెలిసిందే. అధికారులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను కమిషన్ విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం జులై 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
Smita Sabharwal | అనేక అక్రమాలు
కాళేశ్వరం నిర్మాణంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. డిజైన్ మార్పు ఇష్టారీతిన చేపట్టారని పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అనంతరం కాళేశ్వరంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ (CBI)కి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో కమిషన్ నివేదికను రద్దు చేయాలని ఇప్పటికే కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.
Smita Sabharwal | నివేదికలో స్మితా సబర్వాల్ పేరు
ఘోష్ కమిషన్ తన నివేదికలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పేరును సైతం ప్రస్తావించింది. బీఆర్ఎస్ హయాంలో ఆమె ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్విర్తించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను సైతం కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మాణాలను ఆమె సమీక్షించినట్లు కమిషన్ పేర్కొంది. బ్యారేజీలను స్మితా సబర్వాల్ సందర్శించిన ఫొటోలను సైతం నివేదికలో పొందుపరిచింది. కాళేశ్వరం అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. నిజానిజాలను కేబినెట్ ముందు ఉంచనందుకు ఆమెపై సైతం చర్యలు తీసుకోవాలని కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొంది.
Smita Sabharwal | ఎలాంటి చర్యలు చేపట్టకుండా..
ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. పీసీ ఘోష్ కమిషన్‌ను ఆమె సవాల్ చేశారు. ఆ నివేదికను కొట్టి వేయాలని కోరారు. కమిషన్ తనకు 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె పిటిషన్ ఇంకా లిస్ట్ కాలేదు. కాగా స్మితా సబర్వాల్ కొంతకాలంగా సెలవులో ఉన్నారు. తాను వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.