అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం చీవాట్లు పెట్టింది. జనం సొమ్ముతో విగ్రహాలు ఏర్పాటు చేయడం, స్మారక చిహ్నాలు నెలకొల్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తిరునెల్వేలి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని (Karunanidhi Bronze Statue) ఏర్పాటు చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ ప్రముఖులకు అంకితం చేసిన స్మారక చిహ్నాల కోసం ప్రభుత్వ స్థలాలు, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడంపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
Supreme Court | ప్రజా ధనం వినియోగిస్తారా?
మాజీ నాయకులను కీర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రజా ధనాన్ని ఉపయోగించరాదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మీ నాయకులను కీర్తించడానికి ప్రజల సొమ్మును వినియోగించడాన్ని అనుమతించబోమని తేల్చి చెప్పింది. “దీనికి అనుమతి లేదు. మీ మాజీ నాయకులను కీర్తించడానికి మీరు ప్రజా ధనాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు?” అని జస్టిస్ విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది. అవసరమనుకుంటే మద్రాస్ హైకోర్టును (Madras High Court) ఆశ్రయించాలని ధర్మాసనం తెలిపింది.
Supreme Court | హైకోర్టును సమర్థించిన సుప్రీంకోర్టు
తిరునెల్వేలి జిల్లాలోని (Tirunelveli District) ప్రధాన రహదారిపై ఉన్న వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రవేశద్వారం దగ్గర దివంగత నాయకుడు కరుణానిధి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా, న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రదేశాలలో విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేయరాదని మద్రాసు హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.
తిరునెల్వేలి జిల్లాలోని ప్రధాన రహదారిపై ఉన్న వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ ప్రవేశద్వారం దగ్గర దివంగత నాయకుడి కాంస్య విగ్రహం, నేమ్ బోర్డును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా, సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. విగ్రహం ఏర్పాటుకు ప్రజా నిధులను ఉపయోగించుకునేందుకు నిరాకరిస్తూ, అవసరమైతే తగిన ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం తన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (SLP) ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.