అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ramachander Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మాట ఇచ్చి తప్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు వారి తరఫున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మంగళవారం హైదరాబాద్(Hyderabad)లోని అశోక్‌నగర్‌లో ఉద్యోగార్థులతో రాంచందర్‌రావు మాటామంతీ నిర్వహించారు. అలాగే, సిటీ సెంట్రల్‌లైబ్రరీలో నిరుద్యోగులతో సమావేశమై మాట్లాడారు. గ్రూప్-1 వివాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు
Ramachander Rao | ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటికీ ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేసిందా? అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. యువతను కాంగ్రెస్ మోసం చేసిందని, నోటిఫికేషన్లు వేయకుండా వంచించిందన్నారు. రెండేళ్లయినా రేవంత్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేసిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరకు వస్తున్నా ఉద్యోగుల భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
Ramachander Rao | శ్వేతపత్రం విడుదల చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్లే గ్రూప్-1 వివాదం రాజుకుందుని బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రూప్-1 పరీక్ష(Group-1 Exam) మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. యువత జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. యువకులతో తామున్నామని, వారి తరఫున ప్రభుత్వంపై తాము కోట్లాడుతామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. అయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేసే వరకూ తాము పోరాడతామన్నారు.