అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూ సేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియలో జాప్యం చేయొద్దన్నారు.
భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల (National Highways) నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. చిన్న చిన్న కారణాలతో రహదారుల పనుల్లో జాప్యం జరగొద్దని, అలాంటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. భూ సేకరణను పూర్తి చేయడమే కాకుండా పరిహారం తక్షణమే అందేలా చూడాలని చెప్పారు.
CM Revanth Reddy | ఆర్ఆర్ఆర్ పనులపై..
రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాలను నివృత్తి చేస్తున్నప్పటికీ కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్హెచ్ఏఐ (NHAI) అధికారులను సీఎం ప్రశ్నించారు. సందేహాలన్నింటిని ఒకేసారి పంపాలని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలు రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దని చెప్పారు. ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు ఎన్హెచ్ఏఐ సహకరించాలన్నారు.
CM Revanth Reddy | గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుమతులు ఇవ్వాలి
భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) – అమరావతి – మచిలీపట్నం 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడడంతో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ రోడ్డుకు సమాంతరంగా రైల్వే మార్గం కోసం కూడా కేంద్రాన్ని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో రావిర్యాల – మన్ననూర్‌కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు.
హైదరాబాద్ – మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించకారు. హైదరాబాద్-మంచిర్యాల – నాగ్‌పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలను ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలపాలన్నారు.
CM Revanth Reddy | అలసత్వం వహిస్తే వేటు వేస్తాం
మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం – విజయవాడ జాతీయ రహదారి (NH-163G), ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల (NH-63), జగిత్యాల – కరీంనగర్ (MH-563), మహబూబ్‌నగర్ – మరికల్ – దియోసుగూర్ (NH-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సేకరణ, పరిహారం నిర్ణయం, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపైనా సీఎం సమీక్షించారు. అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.